బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు

Telugu Lo Computer
0


బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన డాటా కాపీలు తీసుకున్నారు. సంస్థ ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలపై ఉద్యోగులను ప్రశ్నించారు. కాగా, ఐటీ అధికారుల సోదాలు ముగిసిన తర్వాత బీబీసీ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 'ఢిల్లీ, ముంబైలోని మా కార్యాలయాల నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు ముగించుకుని వెళ్లిపోయారు. అధికారులకు మేం పూర్తిగా సహకరిస్తూనే ఉంటాం. ఈ అంశం త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం. మా సిబ్బందికి అండగా ఉంటాం. సోదాల సందర్భంగా కొందరిని అధికారులు చాలా సేపు ప్రశ్నించారు. ఇంకొందరు రాత్రుళ్లు కూడా కార్యాలయంలోనే ఉండాల్సి వచ్చింది. సిబ్బంది సంక్షేమమే మా ప్రాధాన్యత. మా కార్యకలాపాలు మళ్లీ యథావిధిగా జరుగుతున్నాయి. భారతదేశం, ఇతర ప్రాంతాల్లో ఉన్న మా పాఠకులకు వార్తలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం' అని ప్రకటనలో వివరించింది. అదేవిధంగా 'బీబీసీ అనేది విశ్వసనీయమైన, స్వతంత్ర మీడియా సంస్థ. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా వార్తలు రిపోర్ట్ చేసే మా జర్నలిస్టులు, సహోద్యోగులకు ఎప్పుడూ అండగా నిలబడతాం' అని బీబీసీ ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై పలు జాతీయ ఇంగ్లిష్‌ పత్రికలు తమ సంపాదకీయాల్లో కేంద్రం చర్యలను తప్పుబట్టాయి. సోదాల టైమింగ్‌ను హైలెట్‌ చేసిన 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'.. ప్రతీకార చర్యల ప్రకియలో ఇది మొదటి అడుగు అని పేర్కొన్నది. తనకు వ్యతిరేకంగా ఉంటే మోదీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే విషయాన్ని 'టెలిగ్రాఫ్‌' వివరించింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై ఇలాంటి చర్యలు సాధారణంగా మారాయని 'ది హిందూ' కేంద్రం తీరును ఎత్తిచూపింది. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని 'ట్రిట్యూన్‌' ఆందోళన వ్యక్తం చేసింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌ బీబీసీపై ఐటీ సోదాల ద్వారా ప్రపంచానికి దేశ ప్రతిష్టను దెబ్బతీసే సందేశం పంపిందని 'దక్కన్‌ క్రానికల్‌' వ్యాఖ్యానించింది. అయితే, ప్రధాని మోదీపై డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన నేపథ్యంలో ఆ సంస్థపై దాడులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)