గృహ రుణ గ్రహీతలకు ఆందోళన

Telugu Lo Computer
0


రెపో రేటు మరోసారి పావు శాతం పెరగడం వల్ల గృహ రుణాలు భారంగా మారిపోయాయి. నెలవారీ వాయిదాలు పెరగడం, వ్యవధి ఏళ్లకు ఏళ్లు పెరిగిపోవడంలాంటివి రుణ గ్రహీతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ఏడాది మేలో రెపో రేటు 4.0శాతంగా ఉంది. తాజా పెంపుతో కలిసి 2.50 శాతం పెరిగి 6.50 శాతానికి చేరుకుంది. అంటే మేలో మీరు 6.5శాతం వద్ద తీసుకున్న రెపో ఆధారిత గృహరుణం ఇప్పుడు 9.0శాతానికి చేరుకుంది. పెరిగిన వడ్డీతో లెక్కిస్తే 20 ఏళ్ల వ్యవధికి తీసుకున్న మీ గృహరుణం 30ఏళ్లకూ తీరకపోవచ్చు. కొన్నిసార్లు మీ ఈఎంఐలూ పెరిగేందుకు అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రుణ భారాన్ని దించుకునేందుకు ముందస్తు చెల్లింపు అనేది ఒక శక్తిమంతమైన సాధనంగా చెప్పుకోవచ్చు. ఇంటి రుణానికి చెల్లిస్తున్న వాయిదా మొత్తాలను ఏడాదికోసారి మీ వీలును బట్టి 5-10 శాతం వరకూ పెంచుకునేందుకు ప్రయత్నించండి. ఆదాయం పెరిగినప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టండి. ఇది సులభంగా సాధించగలిగిన అంశమే. దీనివల్ల మీ రుణ వ్యవధి కొన్నేళ్లపాటు తగ్గుతుంది. ఇలా ఏటా మీ ఆదాయం, ఇతర ఖర్చులను బట్టి ఈఎంఐని పెంచే ప్రయత్నం చేయండి. పెరుగుతున్న వడ్డీ రేట్లను ఎదుర్కొనేందుకు ఈఎంఐ పెంపును ఒక మార్గంగా చెప్పొచ్చు. సాధారణంగా రుణం అసలును పాక్షికంగా చెల్లించాలంటే కనీసం ఒక ఈఎంఐని జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ ఈఎంఐ రూ.50,000 అనుకుందాం.. అప్పుడు కనీస చెల్లింపు ఇదే మొత్తం ఉంటుంది. కొంతమంది రుణదాతలు రెట్టింపు ఈఎంఐ మొత్తాన్ని అడిగే అవకాశం ఉంటుంది. అంటే పాక్షిక చెల్లింపు రూ.1,00,000 చేయాలన్నమాట. ఇలా చెల్లించడం అన్నిసార్లూ కుదరక పోవచ్చు. కాబట్టి, ఈఎంఐని పెంచుకుంటే ప్రతి నెలా ముందస్తు చెల్లింపులాగా పనిచేయడం ప్రారంభిస్తుందన్నమాట. ఉదాహరణకు మీ ఈఎంఐ రూ.25,000 అనుకుందాం. దీన్ని రూ.30వేలు చేస్తే రుణం అసలు తొందరగా తీరుతుంది. ఫలితంగా వడ్డీ భారమూ గణనీయంగా తగ్గేందుకు అవకాశం లభిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)