రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్‌లను టేకప్‌ చేస్తారా ?

Telugu Lo Computer
0


ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో పరిస్థితులు విషమిస్తున్నాయి. ఖర్చులు తగ్గించేందుకు ఆయా కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. లేదంటే లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో విప్రో కంపెనీ కొంచెం అడ్వాన్స్‌డ్ గా ఆలోచించింది. రిక్రూట్ చేసుకున్న ఫ్రెషర్స్‌ని తీసేయ్యలేక, తొలగించలేక వారికి ఓ కొత్త ఆఫర్ ఇచ్చింది. రూ. 6.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరి ఏడాది పాటు ట్రైనింగ్ పూర్తి చేసుకుని ప్రాజెక్ట్‌ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రూ. 3.5 లక్షల ప్యాకేజీతో ప్రాజెక్ట్‌లను టేకప్‌ చేస్తారా అని యాజమాన్యం ఈ-మెయిల్స్‌ ద్వారా అడిగింది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, క్లయింట్ల నుంచి డీల్స్‌ జాప్యం అవుతున్న నేపథ్యంలో సగం జీతంతో ప్రాజెక్ట్‌లను అంగీకరించాలని కోరింది. ఈ మేరకు ఫ్రెషర్స్‌కు ఈ నెల 16న ఈ-మెయిల్స్‌ పంపించింది. 'ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, మా వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నాం. ప్రస్తుతం మేం ఇస్తున్న ఆఫర్‌ ద్వారా అభ్యర్థులు వెంటనే వారి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడమే కాకుండా, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చ'ని ఆ ఆంగ్ల వెబ్‌సైట్‌కు విప్రో తెలిపింది. 'ప్రస్తుత ఆఫర్‌కు మీరు అంగీకరిస్తే.. ఇంతకుముందు ఇచ్చిన ఆఫర్‌ రద్దవుతుంద'ని ఫ్రెషర్లకు పంపిన మెయిల్‌లో విప్రో పేర్కొందని సమాచారం. ఇందుకు అంగీకరిస్తే సోమవారంలోపు తెలపాలని ఆ ఈ-మెయిల్‌లో పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)