ఆడపిల్ల పుడితే గ్రామంలో 111 మొక్కలు నాటుతారు !

Telugu Lo Computer
0


రాజస్థాన్ రాష్ట్రం రాజ్ సమంద్ జిల్లాలో పిప్లాంత్రి మారుమూల పల్లెటూరు.  ఈ ఊర్లో ఏ కుటుంబంలో ఆడపిల్ల పుడితే గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి రూ.21 వేలు వసూలు చేసి ఆ మొత్తంతో చిన్నారి చదువు, పెళ్లి, ఇతర బాధ్యతలకు ఉపయోగిస్తారు. అంతేకాదు ఆడపిల్ల పుట్టిన సందర్భంగా ఊరంతా 111 మొక్కలు నాటుతారు. ఊర్లో ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి ఇలా మొక్కలు నాటడంతో ప్రస్తుతం గ్రామం చుట్టుపక్కల మొత్తం నాలుగు లక్షల చెట్లు ఉన్నాయి. ఇన్ని లక్షల చెట్లు ఉండడంతో ఊరంతా పచ్చగా కళకళలాడుతోంది. ఆడపిల్ల పుడితే గ్రామంలో సంబరాలు నిర్వహించి మొక్కలు నాటాలనే ఆలోచనను అమలు చేసిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన శ్యామ్ సుందర్ పాలివాల్ . 17 ఏళ్ల క్రితం శ్యామ్ కుమార్తె కిరణ్ డీహైడ్రేషన్ కారణంగా చనిపోయింది. ఆ బాలిక చనిపోయిన సమయంలో ఊరంతా కరువు కోరల్లో ఉంది. గ్రామం చుట్టూ మైనింగ్ కోసం తవ్వకాలు చేపట్టడంతో పచ్చగా ఉన్న అడవి నాశనమైంది. గ్రామస్తులకు ఉపాధి కూడా లేకుండా పోయింది. అప్పుడు శ్యామ్ సుందర్ గ్రామంలో ఎవరి ఇంట ఆడపిల్ల పుట్టినా ప్రతి ఇంటి నుంచి రూ.21 వేలు వసూలు చేసి ఆ మొత్తాన్ని వారి సంరక్షణకే వినియోగించడం మొదలుపెట్టాడు. అలాగే ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి గ్రామంలో 111 మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. శ్యామ్ ఆలోచన గ్రామస్తులకు అందరికీ నచ్చింది. అంతా ఆయన వెంట నడవడం మొదలుపెట్టారు. అలా ఇప్పుడు గ్రామం చుట్టుపక్కల ఒక కృత్రిమ అడవే సృష్టించారు. నిమ్మ, మామిడి, ఉసిరి తదితర మొక్కలు సంరక్షించడం వల్ల ప్రజలకు ఉపాధి కూడా అందుతోంది. ఎక్కడైనా ఆడపిల్లల పట్ల వివక్ష కనిపిస్తుందేమో కానీ పిప్లాంత్రి గ్రామంలో మాత్రం కనిపించదు. గ్రామస్తుల్లో చైతన్యం నింపి ఆడపిల్ల పుడితే పండగ చేసుకునేలా చేసిన శ్యామ్ సుందర్ కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)