ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ ప్రజా రవాణాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంలో మరో అడుగు ముందుకేసింది. ఇప్పటి వరకు ప్రధాన కేంద్రాలకే పరిమితమైన ఈ టికెటింగ్ సౌకర్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. యూనిఫైడ్ టిక్కెటింగ్ సొల్యూషన్ ద్వారా ఇక నుంచి ప్రతి జిల్లాల్లో కండక్టర్ల దగ్గర కొత్త యూటీఎస్‌ మిషన్లను అధికారులు పంపిణి చేశారు. నగదు రహిత లావాదేవీలు ప్రతి బస్సులో అందుబాటులో ఉండనున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో ముడిపడిన యూనిఫైడ్‌ టిక్కెటింగ్‌ సొల్యూషన్‌ లావాదేవీలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ నియమావళిని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఇటీవలే ప్రారంభించారు. యూటీఎస్‌ ద్వారా ప్రయాణికులు ఎక్కే స్టేజీకి ముందుగా రిజర్వు చేసుకునే సౌకర్యం ఉంది. ఒకే యాప్‌ ద్వారా ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకోవడం, బస్సుల రాకపోకలు, సరుకు రవాణా వివరాలు తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంత బస్సుల టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీలకు సంబంధించి యూపీఐ, డెబీట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, వాలెట్‌ ఇతర కార్డుల ద్వారా, క్యూ ఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో కూడా టికెట్లను కొనుగోలు చేయవచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.  డిపో స్థాయిలో కండక్టర్‌, డ్రైవర్‌ల నుంచి పై స్థాయి అధికారి వరకు దీనిని అమలు చేయాలని, ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని ఏపీఎస్‌ ఆర్టీ ఎండీ కోరారు. ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, సిబ్బంది సహకరించాలని సూచించారు. ఇది పూర్తిగా శాటిలైట్‌ అనుసంధానంతో పనిచేస్తుందని, ఎప్పుడైనా, ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్‌ పొందే సౌకర్యం ఉంటుంది. ఆర్టీసీ విభాగంలో అన్ని డిజిటల్‌ సేవలు ఒకే గొడుగు కిందకు తెచ్చేలా ప్లాన్ చేశారు. ఈ నెలాఖరుకు అన్ని రిజర్వేషన్‌ సర్వీస్‌లలోను, డిసెంబర్‌ నాటికి అన్ని రకాల బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)