ప్రపంచంలోనే అతి పెద్ద రివర్ క్రూయిజ్ 'గంగా విలాస్'

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గంగావిలాస్‌ ఈ నెల 13న పవిత్ర వారణాసిలో కాశీ విశ్వేశ్వరుని సన్నిధి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ నౌకను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మన దేశంలో ఎన్నో విలాసవంతమైన నౌకలున్నాయి. నదుల్లో నడిచే రివర్‌ క్రూయిజ్‌లు కూడా ఉన్నాయి. కానీ వాటిలో దేనికీ లేని ప్రత్యేకత ఈ గంగావిలాస్‌కు ఉంది. అదే భారతీయత.  భారతీయ సంస్కృతిని, సుసంపన్నతను, ఆధ్యాత్మిక వైభవాన్ని మరోసారి ప్రపంచానికి సరికొత్తగా, సగర్వంగా చాటే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఈ నౌకను ప్రారంభించనుంది. నదీజలాల్లో సుదీర్ఘంగా సాగే యాత్ర ఇది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 రోజుల పాటు 3వేల 2 వందల కిలోమీటర్ల పాటు ఈ నౌకావిహారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో మొదలై ఐదు రాష్ట్రాల మీదుగా సాగుతుంది. అంతేకాదు బంగ్లాదేశ్‌ జలాల్లోనూ విహరించడం ఈ నౌకకున్న మరో ప్రత్యేకత. ఈ 51రోజుల్లో ఇది 27 నదులమీదుగా ముందుకు సాగుతుంది. దేవనదిగా పిలుచుకునే గంగలో ప్రయాణం మొదలుపెట్టి చివరకు బ్రహ్మపుత్ర నదితో ముగుస్తుంది. వారణాసి నుంచి మొదలుకానున్న ఈ గంగా విలాస్ ప్రస్థానం ఘజీపూర్, బక్సార్, పాట్నా మీదుగా కోల్‌కతాకు సాగుతుంది. అక్కడ నుంచి బంగ్లాదేశ్ నదీజలాల్లోకి ప్రవేశిస్తుంది. 15రోజుల పాటు బంగ్లా రాజధాని డాకా సహా పలు పట్టణాలను స్పృశిస్తూ మళ్లీ భారత్‌లోకి ప్రవేశించి అసోంలోని దిబ్రూగడ్‌కు చేరుతుంది.  ప్రపంచంలో అత్యధిక దూరం నదీ ప్రయాణం చేసే నౌక ఇదే కానుంది. విలాసవంతంగా విహరించడానికో లేక తింటూ తాగడానికో ఈ నౌకను తీసుకురాలేదు. దీని వెనక ఓ మంచి ఉద్దేశం ఉంది. గంగానది విశిష్ఠత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గంగా నది చుట్టూ ఎంతో నాగరికత వర్ధిల్లింది. హిందుత్వమే కాదు బుద్దిజం కూడా ఈ ప్రాంతంలో విరాజిల్లింది. కాలక్రమేణా నాగరికత పెరిగి మనం మన ప్రాచీనతకు దూరమవుతున్నాయి. ఆధ్యాత్మిక వైభవాన్ని విస్మరిస్తున్నాం.  ఆ మూలాల్లోకి మరోసారి తీసుకెళ్లేలా ఈ క్రూయిజ్ యాత్రను డిజైన్ చేశారు. 51 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఇది 50 చోట్ల ఆగుతుంది. అలాగే ప్రతి ప్రాంతానికి ఏదో ఓ చరిత్ర ఉంది. విశ్వేశ్వరుడు కొలువైన వారణాసి, బౌద్ధ క్షేత్రమైన సారనాథ్, తాంత్రిక విద్యలకు పేరొందిన మయాంగ్. ప్రపంచంలోనే అతి పెద్దదైన నదీ ద్వీపం మజులి, నాటి పాటలీపుత్నం ఇలా వారసత్వ ప్రాంతాల మీదుగా సాగుతుంది. దాంతో పాటు సుందర్బన్​ డెల్టా, కజిరంగా నేషనల్​ పార్క్​సహా దేశంలోని పలు జాతీయ పార్కులు, శాంక్చురీల గుండా ఈ యాత్ర కొనసాగుతుంది. 62 మీటర్ల పొడవు, 12మీటర్ల వెడల్పు ఉన్న ఈ నౌకలో 18 విలాసవంతమైన సూట్‌లున్నాయి. ఒక్కో సూట్‌లో ఇద్దరు ఉండేలా డిజైన్ చేశారు. వాస్తవానికి ఈ నౌకలో 80మంది వరకు ప్రయాణించొచ్చు. అయితే ప్రస్తుతానికి మాత్రం 36మందితోనే యాత్ర నిర్వహిస్తున్నారు. ఫస్ట్‌ బ్యాచ్‌గా సింగపూర్‌కు చెందిన 32మంది ఈ విలాసవంతమైన నౌకలో టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రయాణికులకు ఓ కదిలే ఇంద్రభవనంలో ఉన్న ఫీలింగ్ కలిగించేలా దీన్ని తీర్చిదిద్దారు. ప్రతి సూట్‌కు అటాచ్‌ బాత్‌రూమ్‌, షవర్, కన్వర్టబుల్ బెడ్స్, ఫ్రెంచ్ బాల్కనీ, టీవీ, స్మోక్ అలారమ్స్ ఇలా ఎన్నో సౌకర్యాలు అమర్చారు.  40 మంది ఏకకాలంలో భోజనం చేసేలా రెస్టారెంట్ ను సిద్ధం చేశారు. ప్రతి ప్రయాణికుడికి విలాసవంతమైన భారతీయ ఆహారాన్ని అందించనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి రోజూ భారతీయతను చాటేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. లేజర్‌ షోలు, ఆగే ప్రతి ప్రాంతానికి సంబంధించిన వివరాలతో బుక్‌లెట్‌లు సిద్ధంచేశారు. క్రూయిజ్ లో సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్, స్పా, ఓపెన్ ఎయిర్ అబ్జర్వేషన్ డెక్ వంటి అనేక ఇతర అధునాత సౌకర్యాలు ఉంటాయి… నదీవిహారం సాగుతున్నప్పుడు ఓపెన్‌ డెక్‌పై కూర్చుని అందాలను ఆస్వాదించే సౌకర్యం ఉంది. సుందరబెన్‌ అడవుల్లో రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌ను చూడొచ్చు… కజిరంగా నేషనల్‌ పార్క్‌లో ఒంటికొమ్ము ఖడ్గమృగాల విన్యాసాలను వీక్షించొచ్చు. ఒక్కో సూట్‌కు కనీసం 36లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి 18 లక్షలన్నమాట. కోల్ కతా కేంద్రంగా ఉన్న అంటారా లగ్జరీ రివర్ క్రూయిజ్ దీన్ని నడుపుతోంది. టికెట్ల బుకింగ్ వంటి కార్యకలాపాలన్నీ ఆ సంస్థే నిర్వహిస్తోంది. ఫస్ట్ జర్నీలో స్విట్జర్లాండ్ కు చెందిన 32 మంది టికెట్‌లు బుక్ చేసుకున్నారు. మరో రెండేళ్ల వరకూ దీని టికెట్లు అందుబాటులో లేవని చెబుతున్నారు. భారతీయతపై ప్రత్యేక ఆసక్తి చూపే ఎంతోమంది విదేశీయులు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ యాత్ర ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. గతంలో పనులు పూర్తికాక ఒకసారి, కరోనా లాక్​ డౌన్​ కారణంగా మరోసారి టూర్​ ప్రారంభం వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 13న గంగా విలాస్​ ప్రయాణం మొదలుకానుంది. ఈ యాత్రలో పాల్గొనే విదేశీయుల ద్వారా మన దేశంలోని పర్యాటక స్థలాల వివరాలు ప్రపంచానికి తెలుస్తాయని అధికారులు చెప్పారు. ఈ రివర్​ క్రూయిజ్​ మొదలయ్యాక మన దేశానికి వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)