నా మొదటి జీతం విద్యార్థులకే... !

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా తాను తీసుకునే మొదటి జీతాన్ని సుఖాశ్రయ్ సహాయత కోష్‭కి అందించనున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులు, నిరుపేద మహిళలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందే సుఖాశ్రయ్ సహాయత కోష్‭. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన సుఖాశ్రయ్ సహాయత కోష్‭కు మొత్తం 101 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ నిధులను పేద విద్యార్థుల చదువుకు ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ “దీన్ని ఏదో కరుణలా చూడకండి. కనీస అవసరాల్ని పొందడం ప్రతి వ్యక్తి హక్కు. వారికి ఆ హక్కులు కల్పించేందుకే నేను ఉన్నాను. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవకు ప్రతినిధులు, సాధారణ పౌరులు కూడా అండగా ఉండాలి. మీరు కూడా సుఖాశ్రయ్ సహాయత కోష్‭కు వీలైనంత సహకారం అందించాలి. ప్రజా భాగస్వామ్యం లేనిదే ప్రభుత్వం ఏ పని పూర్తి చేయలేదు'' అని అన్నారు. ''ఇంజినీరింగ్ కాలేజీలు, ఐఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐటీ, పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లు, నర్సింగ్, డిగ్రీ కాలేజీలు మొదలైన వాటిల్లో నైపుణ్యాభివృద్ధి విద్య, ఉన్నత విద్య, వృత్తి శిక్షణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది'' అని హిమాచల్ సీఎం చెప్పారు. వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వారి అవసరాన్ని బట్టి వారికి ఆర్థిక సహాయం కూడా అందించబడుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమ మొదటి చెల్లింపును ఈ నిధికి అందించాలని నిర్ణయించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)