తమిళనాడు లో వెలసిన గెటౌట్ రవి పోస్టర్లు

Telugu Lo Computer
0


తమిళనాడు లో  గవర్నర్ ఆర్ఎన్ రవి, ఎంకే స్టాలిన్  ప్రభుత్వం మధ్య వివాదం అంతకంతకూ ముదురుతోంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగ పాఠం చదివే సమయంలో తమిళనాడు అనే పదంతో పాటు, ద్రవిడ నేతల పేర్లున్న పేరాలను గవర్నర్ చదవకుండా దాటవేయడం, ఇందుకు ప్రతిగా గవర్నర్ రవి ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చవద్దని తమిళనాడు అసెంబ్లీ తీర్మానించడం, గవర్నర్ వాకౌట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో చైన్నైలోని వల్సువర్ కొట్టం, అన్నాశాలై ప్రాంతాల్లో ''గెటౌట్ రవి'' పోస్టర్లు వెలిశాయి. ఇందుకు సంబంధించిన య్యాష్‌ట్యాగ్ సోమవారంనాడు ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయింది. గవర్నర్‌ చర్యలను వ్యతిరేకిస్తూ తందై పెరియార్ ద్రవిడ కళగం కార్యకర్తలు కోయంబత్తూరులో నిరసనలకు దిగారు. గవర్నర్ దిష్టిబొమ్మలకు తగులబెట్టేందుకు ప్రయత్నించారు. గవర్నర్ వ్యతిరేక నిరసనలకు ప్రతిగా స్థానిక బీజేపీ కార్యకర్తలు ప్రదర్శనలకు దిగారు. దీంతో పలుచోట్ల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గవర్నర్, స్టాలిన్ సర్కార్ మధ్య వివాదం ముదురుతున్న క్రమంలో మంగళవారంనాడు గవర్నర్ పొంగల్ ఇన్విటేషన్ సైతం డీఎంకే క్యాడర్ అగ్రహాన్ని రెట్టింపు చేసింది. ఈ ఇన్విటేషన్‌లో రాష్ర ప్రభుత్వ చిహ్నం లేకపోవడం, భారత ప్రభుత్వ చిహ్నం మాత్రమే ఉండటం వీరి ఆగ్రహానికి కారణమైంది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి మాట్లాడుతూ, గవర్నర్‌ వ్యవహరించిన తీరు, దీనిపై అసెంబ్లీ తీర్మానం చేయడం రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే అసాధారణ ఘట్టమని అన్నారు. తమ నేత (స్టాలిన్) సహజంగా విపక్షాలను తన సమాధానాలతో పరుగులు పెట్టిస్తుంటారని, ఈసారి గవర్నర్ చేత పరుగులు పెట్టించారని ఆయన చమత్కరించారు. హక్కులకు భంగం కలిగినప్పుడు ఆందోళన వ్యక్తం చేసిన తొలి ముఖ్యమంత్రి స్టాలిన్ అని ఆయన చెప్పారు. కాగా, అధికార డీఎంకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలపై తమిళనాడు బీజేపీ సీనియర్ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ చర్యను తమిళనాడు బీజేపీ విభాగం పలు ట్వీట్లలో సమర్ధించింది

Post a Comment

0Comments

Post a Comment (0)