గూగుల్‌ సీఈవోను తొలగించండి !

Telugu Lo Computer
0


గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ 12 వేల మందిని తొలగించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు యువర్‌డోస్ట్‌ ఇంజినీరింగ్ డైరెక్టర్ విశాల్ సింగ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ చర్య బయట ఉన్న బాధిత సిబ్బంది మరియు టెక్కీలను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై సోషల్‌ మీడియాలో స్పందించిన విశాల్‌ సింగ్‌ కంపెనీ తాజా పరిస్థితికి సీఈవోగా సుందర్‌ పిచాయ్‌ బాధ్యత వహించాలన్నారు. అలాగే కంపెనీ బోర్డు ముందు సీఈవోను తొలగించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు ప్రగాఢంగా చింతిస్తున్నానని, కంపెనీ ఈ స్థితికి దారితీసిన నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తానని, ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో రాసిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గూగుల్‌లో ఎందుకు కొనసాగాలి అని ప్రశ్నించారు. వాస్తవానికి ముందుగా ఆయనే రిజైన్‌ చేయాలన్నారు. తప్పుడు నిర్ణయాలకు వారే బాధ్యత వహించాలి. కంపెనీ వైఫ్యల్యానికి ఆయనే మూల్యం చెల్లించాలి. సింపుల్‌గా కఠిన నిర్ణయాలకు చింతిస్తున్నాం అని తప్పించుకుంటే సరిపోదు. చివరికి రాజకీయ నాయకులు కూడా ఒక్కోసారి దిగి రాక తప్పదు. రాజీనామా చేయాల్సిందే కదా అంటూ లింక్డ్‌ఇన్‌లో రాశాడు. ఇదే నియమం మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్లకు కూడా వర్తిస్తుందంటూ మండిపడ్డారు. మరోవైపు గత త్రైమాసికంలోనే 17 బిలియన్‌ డాలర్ల లాభాలను ఆర్జించిన కంపెనీకి ఇది ఆమోదయోగ్యం కాదని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ కంపెనీ నిర్ణయాన్ని విమర్శించింది. దీనిపై టెక్‌ ఉద్యోగులు సమిష్టిగా పోరాడాలని పిలుపు నిచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)