ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శకాలు !

Telugu Lo Computer
0


కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని భావిస్తోన్న కొన్ని దేశాలు సంబంధిత ఆంక్షలను పూర్తిగా సడలిస్తున్నాయి. విస్తృతంగా వ్యాక్సిన్‌ అందించినప్పటికీ చాలా దేశాల్లో మహమ్మారి ప్రాబల్యం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తులకు సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతోపాటు జనసమూహాల్లో మాస్కు ధరించడం, కొవిడ్‌ చికిత్స, వైద్య నిర్వహణ విషయంలో సిఫార్సులను అప్‌డేట్‌ చేసినట్లు తెలిపింది. కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో మాస్కు ధరించడంతోపాటు బూస్టరు డోసు వేసుకోవాలని సూచించింది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన బాధితులకు లక్షణాలు కనిపిస్తే అవి మొదలైనప్పటి నుంచి 10 రోజుల పాటు ఐసొలేషన్‌లో ఉండాలి. కరోనా బారిన పడ్డ వ్యక్తికి ఒకవేళ యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్‌ వస్తే ఐసొలేషన్‌ నుంచి ముందుగానే బయటకు రావచ్చు. కొవిడ్‌ నిర్ధారణ అయి లక్షణాలు లేని వారు మాత్రం ఐదు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి. గతంలో వీరికి ఐసోలేషన్‌ వ్యవధి పది రోజులుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో స్థానిక పరిస్థితులతో సంబంధం లేకుండా మాస్కులను విధిగా ధరించాలని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసింది. చికిత్స విషయంలో నిర్మాట్రెల్విర్- రిటోనావిర్ వినియోగాన్ని కొనసాగించాలని సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)