విమానం డోర్ తెరిచింది ఎంపీ తేజస్వి సూర్య !

Telugu Lo Computer
0


చెన్నై నుంచి తిరుచిరాపల్లి వెళ్తున్న ఇండిగో విమానం తలుపు తెరుచుకున్న ఘటనపై కేంద్రం ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. ఈ ఘటనలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పాత్ర ఉండటంతో ఇన్నాళ్లు మౌనం వహిస్తూ వచ్చిన కేంద్రం, విషయం బట్టబయలు కావడంతో చెప్పక తప్పలేదు. గత నెలలో చెన్నై-తిరుచిరాపల్లి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న కర్నాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఎమర్జెన్సీ డోర్ తెరవడంతో పెను ప్రమాదం చోటు చేసుకునేలా కనిపించింది. కానీ అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది వెంటనే డోర్ మూసేసి ఆయన్ను వెనక సీటులోకి పంపించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఈ విషయాన్ని కేంద్రం కానీ, డీజీసీఏ కానీ నిర్ధారించకుండా మౌనం వహించాయి. ఇండిగో సంస్ధ కూడా ఓ ప్రయాణికుడు డోర్ తెరిచినట్లు వెల్లడించింది. దీనికి సదరు ప్రయాణికుడు క్షమాపణ చెప్పినట్లు తెలిపింది. అదే సమయంలో విమానంలో ప్రయాణించిన తోటి ప్రయాణికులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగేలా వ్యవహరించినా కేంద్రం, డీజీసీఏ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విమానయానమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇవాళ జరిగిందేంటో చెప్పేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించిన తేజశ్వి సూర్య పొరబాటున ఈ డోర్ తెరిచారని సింధియా వెల్లడించారు. ఘటన జరిగిన నెల రోజుల తర్వాత కేంద్రం దీన్ని నిర్ధారించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. బీజేపీ ఎంపీని కేవలం క్షమాపణతో వదిలేస్తారా అని ప్రశ్నించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)