వంచిత్ బహుజన ఆఘాడి ఉద్ధవ్ థాకరే పొత్తు

Telugu Lo Computer
0


భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్‌కు చెందిన ''వంచిత్ బహుజన్ ఆఘాడి''  పార్టీతో ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. రాబోయే బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారంనాడు ప్రకటించారు. గత ఏడాది శివసేన రెండుగా చీలిపోయి, ఉద్ధవ్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మొదటిసారిగా బీఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ప్రకాష్ అంబేద్కర్‌తో గత రెండు నెలలుగా ఉద్ధవ్ థాకరే మంతనాలు జరుపుతున్నారు. ''ఈరోజు జనవరి 23. బాలాసాహెబ్ థాకరే జయంతి ఉత్సవం. ప్రకాష్ అంబేద్కర్‌తో కలిసి పనిచేయాలని అనేక మంది కోరుకోవడం నాకు చాలా సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. ఈ రోజు పొత్తుతో కలిసి ముందుకు వెళ్లేందుకు ఇద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చాం'' అని మీడియాతో మాట్లాడుతూ ఉద్ధవ్ చెప్పారు. తన తాతగారు, ప్రకాష్ అంబేద్కర్ తాతగారు ఎంతో సన్నిహితులని, సామాజిక అంశాలపై వారిరువురు పోరాడారని చెప్పారు. థాకరే, అంబేడ్కర్‌లకు చరిత్ర ఉందని, వారి భవిష్యత్ తరాల వారు సైతం దేశంలోని ప్రస్తుత సమస్యలపై పోరాటం సాగించాల్సి ఉందని చెప్పారు. కాగా, నూతన తరహా రాజకీయాలను తమ పొత్తు సంకేతమని ప్రకాష్ అంబేడ్కర్ తెలిపారు. సామాజిక అంశాలపై తాము పోరాడుతున్నామని, సామాజిక అంశాలపై తాము విజయం సాధించామా లేదా అనేది ఓటర్ల చేతిలో ఉంటుందని, అయితే అలాంటి అంశాలపై పోరాటం చేసే వ్యక్తులను పోటీలోకి దించడం అనేది రాజకీయ పార్టీల చేతిలో ఉంటుందని చెప్పారు. మరోవైపు, ఉద్ధవ్ థకరే భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, శరద్ పవార్ నేషనలిస్ట్ పార్టీలు మాత్రం బీఎంసీ ఎన్నికల్లో పొత్తుపై ఇంకా ఎలాంటి పొత్తు ప్రకటనలు చేయలేదు. ఇంతవరకూ పొత్తుకు కాంగ్రెస్ అంగీకారం తెలియజేయలేదని, కూటమిలో శరద్ పవార్ చేరుతారని ఆశిస్తున్నామని ప్రకాష్ అంబేద్కర్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)