షార్ లో 24 గంటల వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య !

Telugu Lo Computer
0


శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్ల ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఒకే రోజు ఇద్దరు జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వ్యక్తిగత కారణాలతోనే ఇద్దరు జవాన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని భావిస్తున్నారు. నిన్న ఉదయం జవాన్ చింతామణి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అదే రోజు సాయంత్రం ఎస్సై వికాస్ సింగ్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చింతామణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. ఎస్సై వికాస్ సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఛత్తీస్ ఘడ్ కు చెందిన 29 ఏళ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం శ్రీహరికోటలోని షార్ యూనిట్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆయనకు పెళ్లి కుదిరింది. ఎంగేజ్ మెంట్ జరిగిన తర్వాత అతని మామ మృతి చెందారు. ఆ తర్వాత యాక్సిడెంట్ తో చింతామణి తమ్ముడు కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ పరిణామాలతో మనస్థాపం చెంది చింతామణి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు. నెల రోజులపాటు దీర్ఘకాలిక సెలవులపై సొంతూరుకు వెళ్లిన చింతామణి ఈ నెల 10న తిరిగి వచ్చారు. అటు అత్మహత్య చేసుకున్న వికాస్ సింగ్ స్వస్థలం బీహార్. నిన్న సాయంత్రం షార్ మొదటి గేట్ దగ్గర గన్ తో తలపై కాల్చుకుని వికాస్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం అతను కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. వికాస్ సింగ్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులతో వికాస్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. అయితే ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో సహచరులంతా ఆందోళన చెందుతున్నారు. చింతామణి విధి నిర్వహణలో ఉండగానే ఉదయం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో సీఐఎస్ఎఫ్ ఎస్సై వికాస్ సింగ్ విధుల్లో ఉన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్ చింతామణి ఆత్మహత్యతో ఎస్సై వికాస్ సింగ్ మానిసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. చింతామణి ఆత్మహత్యపై ఉన్నతాధికారులు తనను నిలదీస్తారనే భయంతోనే వికాస్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)