నేనే నాటాను - రండి ఫొటోలు దిగుదాం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ఐఎస్‌బీ ద్విశతాబ్ది ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉన్న సమయంలో ఇది ఏర్పాటైంది. అప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2001లో ముఖ్యమంత్రి హోదాలో ఐఎస్‌బీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుదీర్ఘ విరామం అనంతరం చంద్రబాబు ఐఎస్‌బీని సందర్శించారు. ఐఎస్‌బీ ప్రతినిధులతో కలిసి ప్రాంగణంలో కలియతిరిగారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తాను శ్రమించానని చెప్పుకొచ్చారు. తన కృషితోనే మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయని వ్యాఖ్యానించారు. విజన్ 2020 గురించి తానే తొలుత ప్రస్తావించానని, ఆ తరువాత దేశం మొత్తం అనుసరించిందని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాలను కాదని ఐఎస్‌బీని నెలకొల్పడానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నారని చంద్రబాబు చెప్పారు. మైక్రోసాఫ్ట్ కూడా హైదరాబాద్‌కే వచ్చిందని గుర్తు చేశారు. అప్పట్లో ఆయా రాష్ట్రాలు ప్రకటించిన రాయితీల కంటే మరిన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చామని, వాటిని అక్షరాలా అమలు చేశామని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటు కావాలంటూ తాను కల కన్నానని, అది సాకారమైందని చెప్పారు. అంతకుముందు- ఐఎస్‌బీ ప్రాంగణంలో ఛీజ్ వుడ్ చెట్టును తిలకించారు చంద్రబాబు. అది ఒకప్పుడు ఆయన నాటిన మొక్కే. 2011 డిసెంబర్ 16వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన ఐఎస్‌బీని సందర్శించారు. అప్పట్లో ఈ మొక్కను నాటారు. ఇప్పుడు మహా వృక్షమైంది. ఆ చెట్టును చూస్తూ చంద్రబాబు మురిసిపోయారు. అక్కడున్న ప్రతినిధులను దాని గురించి వివరించారు. ఈ చెట్టులాగే హైదరాబాద్ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ రంగంలో మహా నగరంగా ఆవిర్భవించిందని చంద్రబాబు అన్నారు. చెట్టు వద్ద ఐఎస్‌బీ ప్రతినిధులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.

Post a Comment

0Comments

Post a Comment (0)