విద్యాభ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకోండి !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా తాము శాంతి ప్రయత్నాల్లో ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తామని భరోసా కల్పించారు. బాధిత ప్రజలకు మానవతాసాయం ఇచ్చేందుకూ కట్టుబడి ఉన్నామన్నారు. వెంటనే యుద్ధాన్ని విరమించేందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇరువర్గాలు చర్చలు ప్రారంభించి విభేదాల్ని పరిష్కరించుకొని దీర్ఘకాలిక పరిష్కారాలకు బాటలు వేయాలని సూచించారు. అలాగే.. ఉక్రెయిన్‌లో చదువుకుంటూ భారత్‌కి తిరిగొచ్చిన విద్యార్థుల విద్యాభ్యాసం కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా జెలెన్‌స్కీని మోడీ కోరారు. ఈమేరకు అధికార ప్రకటన విడుదలైంది. మోడీతో జరిగిన సంభాషణ గురించి ట్విటర్ మాధ్యమంగా జెలెన్‌స్కీ వెల్లడించారు. తాను మోడీతో ఫోన్‌లో మాట్లాడానని, జీ20 ప్రెసిడెన్సీ విజయవంతంగా సాగాలని తాను ఆకాంక్షిస్తున్నానని అన్నారు. గతంలో తాను ఇదే ప్లాట్‌ఫామ్‌ లో శాంతి సూత్రాన్ని ప్రతిపాదించానని, దాని అమలుకు భారత్ మద్దతు ఇస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు. ఈ విషయంలో తనకు భారత్ భాగస్వామ్యంపై నమ్మకం ఉందన్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్ తమకు మద్దతు తెలిపినందుకు, సంక్షోభ సమయంలో మానవతా సాయం అందించినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధనేరాలకు బాధ్యులైనవారిని శిక్షించడం, ఉక్రెయిన్‌ నుంచి రష్యా బలగాలన్ని ఉపసంహరించడం, తమ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడం వంటి 10 అంశాల శాంతి ప్రణాళికను తాను వివరించినట్లు పేర్కొన్నారు. అలాగే ఆహార, ఇంధన, అణు భద్రతకు భరోసాను కోరుతున్నట్లు కోరారు.


Post a Comment

0Comments

Post a Comment (0)