పుంగనూరులో రామచంద్ర యాదవ్‍ ఇంటిపై దాడి !

Telugu Lo Computer
0


చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో చేపట్టిన రైతుభేరి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీలకతీతంగా పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‍ చేపట్టిన రైతుభేరికి అనుమతులు లేవంటూ పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పుంగనూరులోని ఆయన ఇంటి నుంచి బయలుదేరిన వాహన శ్రేణిని పోలీసులు అడ్డుకుని ఆయన అనుచరులను 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదుంలో రైతుభేరికి వెళ్లనీయకుండా రామచంద్ర యాదవ్‌ను నిలువరించిన పోలీసులు ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఆయనను విడిచిపెట్టారు. దాంతో ఆయన తన అనుచరులు, మద్దతుదారులతో ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఇంటికి తిరిగివచ్చారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదని రామచంద్ర యాదవ్‍ మండిపడ్డారు. తాను చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని పోలీసుల చేత అడ్డుకుంటున్నారన్నారు. రైతు సమస్యల పై పోరాడుతుంటే అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి 9 గంటల సమయంలో రామచంద్రయాదవ్ అనుచరులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇది గమనించిన వైసీపీ కార్యకర్తలు సుమారు 200 మంది కర్రలు, రాళ్లతో  ఒక్కసారిగా ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. లోపలకు రాకుండా తాళాలు వేసి రాళ్లు, కర్రలతో తలుపులు, అద్దాలను బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ఫర్నిచర్‌ విరగ్గొట్టారు. ఆరు కార్ల అద్దాలు పగలకొట్టారు. సుమారు అరగంట పాటు రణరంగం సృష్టించారు. రామచంద్ర ఓ గదిలో ఉండి ప్రాణాలతో బయటపడ్డారు. రామచంద్ర అనుచరులు వెళ్లి చెప్పడంతో వచ్చిన పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలను బతిమాలడమే తప్ప నిలువరించే యత్నం చేయలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీగా బలగాలు తరలివచ్చి స్వల్ప లాఠీఛార్జి చేశాయి. కొందరు వ్యక్తులు మద్యం మత్తులో రామచంద్ర యాదవ్‌ ఇంటిపై దాడి చేస్తున్నారని తెలిసిన వెంటనే వచ్చామన్న డీఎస్సీ సుధాకర్‌రెడ్డి లాఠీఛార్జితో పరిస్థితిని అదుపు చేశామన్నారు. రామచంద్ర యాదవ్‍ను సదుం వెళ్లకుండా పుంగనూరులోని ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించి అడ్డుకున్న పోలీసులు వైసీపీ శ్రేణులు ఇంత విధ్వంసానికి దిగినా కళ్లప్పగించి చూస్తుండిపోయారని ఆయన మద్దతుదారులు మండిపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)