కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోంది !

Telugu Lo Computer
0


బీజేపీ నేతలంతా ఐఫోన్లే వాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేస్తోందని, నేతలకు తెలియకుండానే ప్రభుత్వానికి చాలా విషయాలు తెలిసిపోతున్నాయన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా నీచమైన పనిగా ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న పాత ఫోన్ల స్థానంలో కొత్త ఐఫోన్లు కొనుక్కోవాలని ఆయన సూచించారు. శుక్రవారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశంలో సంజయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తక్షణం రూ.లక్ష వరకు రుణ మాఫీ అమలు చేయాలని, ధరణి కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ అధ్యక్షతన జరిగిన ముఖ్య నేతలు, పదాధికారుల అత్యవసర సమావేశంలో ప్రజా సంగ్రామ యాత్ర, రుణమాఫీ, సంస్థాగత బలోపేతం, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం, పార్లమెంటరీ ప్రవాస్‌ యోజన, ప్రధాని మన్‌ కీ బాత్‌ అంశాలపై చర్చించారు. అంతకుముందు మరో బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఇదే విషయాన్ని మీడియాతో అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోందని వ్యాఖ్యానించారు. తన ఇంటిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడి చేశారని ఆరోపిస్తూ.. మీడియాతో తెలంగాణ ప్రభుత్వం బీజేపీ వాళ్ల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నదని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)