అయేషా పేరుతో చట్టం తేవాలి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో అయేషా మీరా హత్య జరిగి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా 'ఇంకెన్నాళ్లు' పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయేషా మీరా తల్లి శంషాద్ బేగం మాట్లాడుతూ అయేషా హత్యకు గురై 15 ఏళ్లు అయ్యిందని, ఐపీఎస్ అధికారి ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కేసును తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. సత్యం బాబును అరెస్టు చేసినా కోర్టులో దోషిగా నిర్ధారించలేదన్నారు. 2018 డిసెంబరులో కేసు సీబీఐ స్వీకరించిందని, తమను సికింద్రాబాద్ తీసుకెళ్లి డీఎన్ఏ టెస్ట్ చేయించారని, తమ దగ్గర ఉన్న అన్నీ వివరాలు సీబీఐకి ఇచ్చామన్నారు. తమ మత పెద్దలు నాడు రీ పోస్ట్ మార్టం కోసం అంగీకరించలేదని.. ఆ తరువాత కోర్టు ఆదేశాలతో రీ పోస్ట్ మార్టం చేశారని వివరించారు. మూడేళ్లుగా తమ పాప శరీర భాగాలు కూడా వెనక్కి ఇవ్వలేదని అయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును బైఫర్ కేషన్ చేశామని అధికారులు అంటున్నారని,  సీబీఐ కూడా అవినీతిమయం అయిపోయిందని విమర్శలు చేశారు. అందుకే తాము సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అసలైన దోషులకు శిక్ష పడి న్యాయం జరిగే వరకు ముందుకు సాగుతామన్నారు. తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో అయేషా హత్య జరిగిందన్నారు. అందువల్ల జగన్ ఇప్పుడు నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం చేయాలని కోరారు. నేరస్థులకు శిక్ష పడేలా ప్రభుత్వం వైపు సహకారం అందించాలన్నారు. అయేషా హత్యపై న్యాయ పోరాట సమితి పేరుతో పోరాటం చేస్తున్నామని గంగా భవానీ వెల్లడించారు. 2007లో చనిపోయిన నాటి నుంచి 2019 వరకు అనేక శాఖల అధికారులు దర్యాప్తు చేశారని.. సీబీఐ విచారణ చేసినా దోషులు పట్టుకోలేక పోయారన్నారు. వారు ఎవరి ఒత్తిడులకు లొంగారో తేల్చాలన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం కూడా అందించలేదన్నారు. మోదీ, జగన్ ప్రభుత్వాలపై తమకు నమ్మకం లేదన్నారు. అందుకే సుప్రీంకోర్టులో పోరాటం చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్రజా సంఘాలు కూడా తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)