92,570 కోట్ల రూపాయలను బడా బాబులు ఎగ్గొట్టారు !

Telugu Lo Computer
0

భారతీయ బ్యాంకులకు 92,570 కోట్ల రూపాయలను బడా బాబులు ఎగ్గొట్టారని  కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా విపక్షాలు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం బుధవారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఈ సమాధానంలో బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారి జాబితాలను వెల్లడించింది. కాగా, ఈ ఉద్దేశపూర్వక డిఫాల్టర్ల జాబితాలో వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీ మొదటి స్థానంలో ఉన్నట్లు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కారత్ తెలిపారు. బ్యాంకులకు చోక్సీ ఎగ్గొట్టిన మొత్తం 7,848 కోట్ల రూపాయలని ఆయన ప్రకటించారు. చోక్సీ తరువాత ఏరా ఇన్ఫ్రా, రీగో ఆర్గో సంస్థలు రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి. ఏరా ఇన్ఫ్రా 5,879 కోట్ల రూపాయలు ఎగ్గొట్టగా, రీగో ఆగ్రో 4,803 కోట్ల రూపాయలు టోకరా పెట్టింది. భారత రిజర్వు బ్యాంకు వెల్లడించిన గణాంకాల ప్రకారం డేటాను సిద్ధం చేసి సమర్పించినట్లు కేంద్ర మంత్రి కారత్ తెలిపారు. ఉద్దేశపూర్వక డిఫాల్టర్ అనేది తీసుకున్న రుణం తిరిగి చెల్లించే స్థోమత ఉన్నప్పటికీ చెల్లించని వారికి ఉపయోగించే పదం. ఇలాంటి వారిని డిఫాల్టర్లుగా ప్రకటించడం వల్ల భవిష్యత్తులో వీరికి బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందదు. ఉద్దేశపూర్వక డిఫాల్టర్ జాబితాలో కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ (రూ.4,596 కోట్లు), ఎబిజి షిప్‌యార్డ్ (రూ.3,708 కోట్లు), ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ (రూ.3,311 కోట్లు), విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ (రూ.2,931 కోట్లు), రోటోమాక్ గ్లోబల్ (రూ.2,893 కోట్లు), కోస్టల్ కంపెనీలు (రూ.2,311 కోట్లు), జూమ్ డెవలపర్లు (రూ. 2,147 కోట్లు) ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు 8.9 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నఅనంతరం మళ్లీ 3 లక్షల కోట్ల రూపాయలకు తగ్గాయి. భారత రిజర్వు బ్యాంకు అసెట్ క్వాలిటీ రివ్యూ అనంతరం స్థూల ఎన్‭పీఏలు 5.41 లక్షల కోట్ల రూపాయలు తగ్గాయి. ఇక ఇదే సందర్భంలో బ్యాంకులు 10.1 లక్షల కోట్ల రూపాయల రుణాల్ని మాఫీ చేశాయని కేంద్ర మంత్రి కరాత తన సమాధానంలో తెలిపారు. కాగా, ఇందులో భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 2 లక్షల కోట్ల రూపాయలు రైట్-ఆఫ్‌లు ఇచ్చింది. 67,214 కోట్ల రూపాయలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాతి స్థానంలో ఉంది. ఇక ప్రైవేటు బ్యాంకులూ ఈ జాబితాలో లేకపోలేదు. ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా రూ.50,514 కోట్ల రుణాలను మాఫీ చేసింది. హెచ్‭డీఎఫ్‭సీ బ్యాంక్ రూ.34,782 కోట్లు మాఫీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)