తగ్గనున్న ఉల్లి ఉత్పత్తి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 8 November 2022

తగ్గనున్న ఉల్లి ఉత్పత్తి !


2022-23 ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే 13 శాతం తగ్గి 9.5 మిలియన్ టన్నులకు పడిపోయే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక తెలిపింది. 2021-22 ఖరీఫ్ సీజన్‌లో మొత్తం ఉల్లి ఉత్పత్తి 10.8 మిలియన్ టన్నులుగా ఉందని పేర్కొంది. రబీ ఉల్లి నిల్వలు పుష్కలంగా అందుబాటులో ఉన్నందున తక్కువ ఉత్పత్తి అయినప్పటికీ ధరలు అదుపులో ఉంటాయని ఆ నివేదిక అంచనా వేసింది. 2021-22 రబీ సీజన్‌లో 20 మిలియన్ టన్నుల భారీ ఉత్పత్తి సాధించిందని, ఇది ఏడాది కాలంలో 17 శాతం పెరిగిందని వివరించింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. భారతదేశం ప్రతి నెలా 13 లక్షల టన్నుల ఉల్లిపాయలను వినియోగిస్తుంది. ఇది గృహ వినియోగానికి ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పంటల్లో ఒకటిగా ఉంది. భారత్‌లో ఉల్లి సరఫరాలో ఎక్కువ శాతం వాటా నాలుగు రాష్ట్రాలదే. అందులో మహారాష్ట్ర (13.3 మిలియన్ టన్నులు), మధ్యప్రదేశ్ (4.7 మిలియన్ టన్నులు), కర్నాటక (2.7 మిలియన్ టన్నులు), గుజరాత్ (2.5 మిలియన్ టన్నులు) ఉత్పత్తి చేస్తున్నాయి. 2021-22 నాటికి భారత్‌లో మొత్తం ఉత్పత్తిలో వీటి వాటా 75 శాతంగా ఉంది. గత మూడేళ్ల కాలంలో వాతావరణ హెచ్చుతగ్గులు పంట దిగుబడిపై ప్రభావం చూపాయి. ఖరీఫ్ ఉల్లి పంటను అకాల వర్షాలు దెబ్బతీశాయి. పంట దిగుబడి తగ్గుదలకు, ధరల పెరుగుదలకు ఇది దారితీసింది. 2022-23లో కూడా పంట నష్టం ఇదే విధంగా ఉంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. దేశంలో ఖరీఫ్ ఉల్లి ఉత్పత్తిలో 60 శాతం వాటా రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ సహా ఖరీఫ్ ఉల్లి ఉత్పత్తి చేసే అన్ని కీలక ప్రాంతాల్లో వర్షాల వల్ల పంట దెబ్బతింది. మహారాష్ట్ర, కర్నాటకలో జూన్‌లో వర్షాభావ పరిస్థితులు, జూలై, ఆగస్టులో అధిక వర్షపాతం నమోదవడంతో పంటల సాగుపై ప్రభావం పడిందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. జూలైలో మహారాష్ట్రలో ఉల్లి నర్సరీలు దెబ్బతినగా, జూన్‌లో వర్షాలు కురియకపోవడంతో వర్షాధార ప్రాంతాల్లో కర్ణాటక రైతులు ఉల్లిని పండించలేకపోయారు. ఫలితంగా మహారాష్ట్ర ఉల్లి రైతులు మొక్కజొన్న వంటి పంటల వైపు, కర్ణాటక రైతులు వర్షాధార ప్రాంతాల్లో పత్తి వైపు మొగ్గు చూపారు. నీటిపారుదల ప్రాంతాల్లో చెరకు సాగు చేశారని ఆ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధిక వర్షాల వల్ల పొలంలో నీరు చేరి, ఉల్లి నాట్లను కష్టతరం చేసింది. అందువల్ల ఈ సీజన్‌లో దిగుబడి మెరుగుపడదని, 2021-22 సీజన్‌తో సమానంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ఈ సీజన్‌లో ఉల్లి పంట సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టిందని, ప్రతికూల సెంటిమెంట్ నేపథ్యంలో 2021-22లో 6.7 లక్షల హెక్టార్ల నుంచి 2022-23లో దాదాపు 13 శాతం తగ్గి 5.8 లక్షల హెక్టార్లకు తగ్గుతుందని అంచనా వేసింది. 2021-22 రబీ ఉల్లి ధర పతనమే సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణమని పేర్కొంది. 2022 మేలో రబీ ఉత్పత్తి భారీగా అంటే సుమారు 20 మిలియన్ టన్నుల మేరకు రావడంతో ఉల్లి ధరలు 27 శాతం క్షీణించి కిలో రూ.8కి తగ్గిపోయాయి. 2023 సెప్టెంబర్ నాటికి రబీ నిల్వలు పూర్తిగా వినియోగించబడతాయని, ఆ తర్వాత తాజా ఖరీఫ్ దిగుబడులు మార్కెట్‌లోకి వస్తాయని నివేదిక పేర్కొంది. అయితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో వరుసగా 20 శాతం, 25 శాతం, 15 శాతం రబీ నిల్వలు అందుబాటులో ఉంటాయని నివేదిక అంచనా వేసింది. ఈ రబీ నిల్వలు తాజా ఖరీఫ్ దిగుబడులతో పోటీ పడుతుందని ఒక అంచనా.

No comments:

Post a Comment