జంషెడ్‌ జె. ఇరానీ కన్నుమూత

Telugu Lo Computer
0


టాటా స్టీల్‌ మాజీ డైరెక్టర్‌ జంషెడ్‌ జె. ఇరానీ (85) సోమవారం అర్థరాత్రి మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన జంషేడ్‌పూర్‌లోని టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు టాటా స్టీల్‌ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. టాటా స్టీల్‌తో జె.జె.ఇరానీకి 40 ఏళ్ల అనుబంధం ఉంది. వివిధ రంగాలలో కంపెనీకి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఆయన 2011 జూన్‌లో పదవీ విరమణ పొందారు. 1936 జూన్‌ 2న నాగ్‌పూర్‌లో జిజి ఇరానీ, ఖోర్షెడ్‌ ఇరానీ దంపతులకు జంషేడ్‌ ఇరానీ జన్మించారు. నాగ్‌పూర్‌ సైన్స్‌ కాలేజ్‌లో 1956లో బిఎస్‌సి పూర్తి చేశారు. 1958లో నాగ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి జియాలజీలో ఎంఎస్‌సి పట్టా పొందారు. అనంతరం ఆయన బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ వర్సిటీకి జెఎన్‌ టాటా స్కాలర్‌గా వెళ్లారు. అక్కడ 1960లో మెటాలర్జీలో మాస్టర్స్‌ పూర్తిచేశారు. తర్వాత అదే సబ్జెక్టులో 1963లో పిహెచ్‌డి పూర్తి చేశారు. తొలుత అక్కడే బ్రిటిష్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌లో కొంతకాలం ప్రొఫెసర్‌గా పనిచేశారు. స్వదేశానికి తిరిగొచ్చిన జె.జె.ఇరానీ అప్పటి 'టాటా ఐరన్‌ అండ్‌ స్టీల్‌ (ప్రస్తుతం టాటా స్టీల్‌)'లో చేరారు. 1981లో టాటా స్టీల్‌ బోర్డులో చేరిన ఆయన 2001 నుంచి నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా దశాబ్దం పాటు సేవలందించారు. టాటా సన్స్‌, టాటా మోటార్స్‌, టాటా టెలీసర్వీసెస్‌ సంస్థలకు కూడా డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం 2007లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 2008లో జీవన సాఫల్య పురస్కారంతో పాటు పలు అవార్డులు, ప్రశంసలు పొందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)