ఆస్ట్రేలియాను హడలెత్తించిన ఆప్ఘనిస్తాన్

Telugu Lo Computer
0


టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలో ఇప్పటి వరకు ఆప్ఘనిస్తాన్ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నా అవి వరుణుడి కారణంగా వచ్చాయి. తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ గెలిచినంత పని చేసింది. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు తుదికంటా పోరాడింది. కానీ తృటిలో విజయం చేజార్చుకుంది. 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్తాన్ 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆస్ట్రేలియా 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఆసీస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. స్టాయినీస్ వేసిన చివరి ఓవర్‌లో 22 పరుగులు చేయాల్సి ఉండగా రషీద్ విజృంభణతో 17 పరుగులు మాత్రమే వచ్చాయి. అంతకుముందు ఈ మ్యాచ్ టాస్ గెలిచి ఆప్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 168 పరుగులు చేసింది. ఎట్టకేలకు మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి వచ్చాడు. అతడు హాఫ్ సెంచరీతో రాణించాడు. 32 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 45 పరుగులు, స్టాయినీస్ 25 పరుగులు చేశాడు. ఆప్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు, ఫజల్లా ఫరూఖీ 2 వికెట్లతో రాణించారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. కాగా ప్రపంచకప్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సెమీస్ చేరాలంటే శనివారం నాడు ఇంగ్లండ్‌పై శ్రీలంక గెలవాల్సి ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)