నేడు బీజేపీ బహిరంగ సభ

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను హైకోర్టు ఇచ్చిన షరతులకు లోబడి ప్రారంభించారు. నిన్న రాత్రి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మకు ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్,  ఆ తర్వాత పాద యాత్రను మొదలుపెట్టారు. నేటి మధ్యాహ్నం 1.30కి భైంసా శివారులో బహిరంగ సభ జరగనుంది. నిర్మల్ నేషనల్ హైవే పక్కన ఉన్న గణేశ్ ఇండస్ట్రీ ప్రాంగణంలో దీన్ని నిర్వహించాలని నిన్న రాత్రి 11 గంటలకు పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఈ సభకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. పాదయాత్ర ప్రారంభించకుండా ఆదివారం పోలీసులు బండి సంజయ్‌ని అడ్డుకోవడంతో.. సోమవారం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ . ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు.. భైంసా సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే సభ నిర్వహించుకోవాలని తెలిపింది. అలాగే భైంసా సిటీ గుండా పాదయాత్ర వెళ్లకూడదని సూచించింది. పాదయాత్రలో పాల్గొన్నవారు ఎలాంటి ఆయుధాలూ వాడకూడదని తెలిపింది. అందుకు అంగీకరించిన బీజేపీ నేతలు.. ఆ ప్రకారమే తమ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. నిన్న అమల్లోకి తెచ్చిన ఈ సెక్షన్‌ను ఇవాళ కూడా అమల్లో ఉంచుతున్నారు. ఈ కారణంగా భైంసాలో భారీగా పోలీసులు మోహరించారు. ఐతే.. 144 సెక్షన్‌పై పోలీసులు అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఇవాళ బహిరంగ సభ జరగనుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఐతే.. ఇది సిటీకి శివారులో జరుగుతోంది కాబట్టి.. శాంతి భద్రతలకు ఎలాంటి సమస్యా రాదనే అభిప్రాయం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)