చార్టర్ విమానాలకు ఫుల్ డిమాండ్

Telugu Lo Computer
0


గుజరాత్ అసెంబ్లీకి వచ్చేనెల మొదటి వారంలో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రచారానికి టైం దగ్గర పడుతుండటంతో చార్టర్ విమానాలకు డిమాండ్ పెరుగుతోంది. అధికార బీజేపీతోపాటు కాంగ్రెస్‌, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)ల నేతల ప్రచార షెడ్యూల్ ఊపిరి సలపనంత టైట్‌గా ఉంది. దీంతో ప్రజలకు చేరువయ్యేందుకు నేతలంతా ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్లు బుక్ చేసుకుంటున్నారు. కనీసం 50 శాతం విమానాలు, హెలికాప్టర్లు రాజకీయ పార్టీలే బుక్ చేసుకున్నాయని ఒక ఆంగ్లదిన పత్రికలో వార్తాకథనం ప్రచురించింది. ఇంతకుముందు షెడ్యూల్డ్ విమానాల్లోనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రాజకీయ నేతలు.. ఇప్పుడు చార్టర్ జెట్ ఫ్లైట్లు, హెలికాప్టర్లను ఉపయోగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్ పార్టీల నేతల కోసం ఈ నెల తొలి 15 రోజుల్లో కనీసం 400 చార్టర్ ఫ్లయిట్లు, హెలికాప్టర్లు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాయని తెలుస్తున్నది. అక్టోబర్‌లో 600కి పైగా విమానాలు గుజరాత్‌ను చుట్టేశాయని ఆ ఆంగ్ల దినపత్రిక కథనం సారాంశం. గత నెలలో గుజరాత్‌లో డిఫెక్స్ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు కార్పొరేట్ సంస్థల అధినేతలు చార్టర్ ఫ్లయిట్లతో చక్కర్లు కొట్టారు. ఈ నెలలో మెజారిటీ చార్టర్ ఫ్లయిట్లన్నీ రాజకీయ నేతలే బుక్ చేసుకున్నారు. కనీసం నాలుగు గంటల నుంచి ఐదు రోజుల వరకు నాయకులు చార్టర్ ఫ్లయింట్ బుక్ చేసుకుంటున్నారని తేలింది. పలు పార్టీలు ఢిల్లీ లేదా ముంబై నుంచి చార్టర్ ప్లయిట్లు బుక్ చేసుకున్నాయి. అవసరమైనప్పుడు ప్రచారానికి వెళ్లడానికి వీలుగా కాంగ్రెస్‌, బీజేపీ, ఆప్ పార్టీలు ప్రతి రోజూ నాలుగైదు విమానాలను స్టాండ్‌బై గా బుక్ చేసుకున్నాయి. ఒక రోజుకు చార్టర్ ఫ్లయిట్ అద్దె కింద రూ.15-30 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. గత రెండేండ్లుగాచార్టర్ ఫ్లయిట్లు, హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. గిరాకీని అందుకునేందుకు వీలుగా ఏవియేషన్ లీజింగ్ కంపెనీలు కొత్త విమానాల కోసం ఎదురు చూస్తున్నాయి. పెరుగుతున్న ప్రైవేట్ చార్టర్ విమానాల బుకింగ్ అవసరాలను అందుకోవడానికి ఇప్పుడు కొత్త విమానం బుక్ చేస్తే డెలివరీ కావడానికి కనీసం రెండేండ్లు పడుతుందని విమానయాన రంగ వర్గాలు చెబుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)