రాజస్థాన్‌లో ముదురుతున్న సంక్షోభం

Telugu Lo Computer
0


రాజస్థాన్‌ కాంగ్రె్‌సలో నెలకొన్న సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. సీఎం అశోక్‌గహ్లోత్‌, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కుతోంది. గహ్లోత్‌ను తప్పించి పైలట్‌ను సీఎంగా కూర్చోబెట్టేందుకు సీఎం వర్గీయులు సహకరించే పరిస్థితి లేదు. అందుకే అధిష్ఠానం తాత్సారం చేస్తోంది. వారి విమర్శలతో పార్టీ ప్రతిష్ఠ దిగజారుతున్నా పెద్దగా పట్టించుకోవడంలేదు. కానీ, నాయకత్వ మార్పుపై పైలట్‌ గళమెత్తడంతో గహ్లోత్‌ తిప్పికొట్టారు. ఆయన్ను ద్రోహిగా అభివర్ణించారు. బీజేపీ దన్నుతో రెండేళ్ల కింద రాష్ట్రంలో సొంత పార్టీ ప్రభుత్వాన్నే కూల్చాలని ప్రయత్నించారని, ఏ దేశంలోనూ ఇలా జరగలేదని పార్టీకి పైలట్‌ ద్రోహం చేశారని దుయ్యబట్టారు. తన స్థానంలో 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేసినా తనకిష్టమేనని, పైలట్‌కు మాత్రం అవకాశం ఇవ్వడానికి వీల్లేదని గురువారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దీనిపై పైలట్‌ మండిపడ్డారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ఘోరంగా ఓడిందని గహ్లోత్‌ సారథ్యంలో రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశించనున్న తరుణంలో వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం కలవరపాటుకు గురైంది. ఇలాంటి పరుష వ్యాఖ్యలు సీనియర్‌ నేత అయిన ఓ ముఖ్యమంత్రి నోటి నుంచి రావడం అవాంఛనీయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. 'గహ్లోత్‌ వ్యాఖ్యలకు అందరూ ఆశ్చర్యపోయారు. మనమంతా ఓ కుటుంబం. కాంగ్రె్‌సకు అనుభవజ్ఞుడైన గహ్లోత్‌ లాంటి సీనియర్‌ నాయకుడూ కావాలి. పైలట్‌ వంటి ఔత్సాహిక యువ నేతా అవసరం. అయితే పార్టీయే సుప్రీం.. వ్యక్తులు కాదు. ఏ పరిష్కారమైనా దీని ఆధారంగానే జరుగుతుంది.' అని తెలిపారు. ఇంకోవైపు.. 80 శాతం మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పైలట్‌కు మద్దతిస్తున్నారని, సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేస్తే నిరూపిస్తామని మంత్రి రాజేంద్రసింగ్‌ ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)