మంకీపాక్స్‌ కాదు ఎంపాక్స్ !

Telugu Lo Computer
0


మంకీపాక్స్ వ్యాధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ  కొత్త పేరును పెట్టింది. ఇకపై మంకీపాక్స్‌ను 'ఎంపాక్స్‌' అని పిలవాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేసింది. వచ్చే ఏడాది వరకు ఈ వ్యాధిని మంకీపాక్స్, ఎంపాక్స్ అని రెండు పేర్లతో పిలవొచ్చని, ఆ తర్వాత పాత పేరును తొలగించి కొత్త పేరును మాత్రమే ఉపయోగించాలని ప్రకటన చేసింది. మంకీపాక్స్ అనే పేరుపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. జాత్యహంకార, అసభ్య పదజాలంతో దూషణలు వస్తున్నాయన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై నిపుణులతో చర్చించి మంకీపాక్స్ పేరును 'ఎంపాక్స్‌' గా మార్చాలని నిర్ణయించారు. మంకీ పాక్స్ వైరస్ సోకితే శరీరంపై భిన్నమైన దద్దుర్లు, తీవ్ర జ్వరం ఉంటాయి. సాధారణంగానే చాలా మంది దీని నుంచి కోలుకోగలరని.. కొందరిలో మాత్రం ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంకీ పాక్స్ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. కానీ సోకినవారికి బాగా సన్నిహితంగా మెలిగినా, తాకినా, వారి వస్తువులు, దుస్తులు ఉపయోగించినా.. వైరస్ సోకే అవకాశం ఉంటుంది. మంకీ పాక్స్‌లో రెండు రకాలు ఉన్నాయని ఇంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 2022 మే నెల నుంచి మంకీ కేసుల సంఖ్య అధికమైంది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 30 వేల వరకు మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ ప్రభావం మరితం తీవ్రంగా ఉంది. మంకీ పాక్స్ చాప కింద నీరులా పాకేస్తోందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)