దేశం కోసం పొత్తు కొనసాగిస్తాం !

Telugu Lo Computer
0


వీరసావర్కార్ హిందుత్వ ఐడియాలజీపై రాహుల్ గాంధీ విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తుల విషయమై అడిగిన ప్రశ్నకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో సంజయ్ రౌత్ సమాధానమిస్తూ, విభేదాలున్నా కాంగ్రెస్‌తో పొత్తు సాగించడానికి కారణం దేశం కోసమేనని అన్నారు. ''పొత్తులున్నప్పుడు రాజీలు కూడా ఉంటాయి. మా (శివసేన) సిద్ధాంతాల విషయంలో మార్పులేమీ లేవు. బీజేపీని వీడామే కానీ , హిందుత్వ సిద్ధాంతాన్ని కాదు. ప్రతి అంశంలోనూ కాంగ్రెస్‌తో మేము ఏకీభవించక పోవచ్చు. కొన్ని అంశాల విషయంలో మాత్రం శివసేన రాజీ పడదు. హిందుత్వం విషయంలో కానీ, సావర్కర్ విషయంలో కానీ రాజీ ప్రసక్తే లేదు. ఆ విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం'' అని సంజయ్ రౌత్ తెలిపారు. సావర్కర్ పదేళ్లకు పైగా అండమాన్ జైలులో గడిపారని, జైలు జీవితం గడిపిన వారికి మాత్రమే అదెలా ఉంటుందో తెలుస్తుందని అన్నారు. ''సావర్కర్ సిద్ధాంతాన్ని చాలా మంది అంగీకరిస్తారు. అలాగే చాలామంది అంగీకరించరు. అయితే తమను తాము సమర్ధించుకునేందుకు ఎవరూ ఎల్లకాలం బతికి ఉండరు. అది సావర్కర్ కావచ్చు, నెహ్రూ, సర్దార్ పటేల్, నేతాజీ సుభాష్ బోస్ కావచ్చు. గతంలోకి వెళ్లి చరిత్రను తవ్వుకోవడం మాత్రం సరైనది కాదు'' అని సంజయ్ రౌత్ అన్నారు. హిందుత్వ ఐడియాలజీ, సావర్కర్ విషయంలో కాంగ్రెస్ ఐడియాలజీని తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటుందని చెప్పారు. ''రాహుల్ గాంధీతో మేము ఏ విషయంలోనూ చర్చించలేదు. మహారాష్ట్రలో కూటమి ఏర్పాటు సమయంలో సావర్కర్‌పై సోనియాగాంధీతో మాట్లాడాం. కొన్ని అంశాలు ప్రస్తావించకుండా ఉంటేనే మంచిదని మేము నిర్ణయించుకున్నాం. పొత్తులనేవి ఎప్పుడు రాజీలపైనే ఉంటాయి'' అని రౌత్ అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఎంతకాలం కొనసాగుతుందనే ఊహాగానాలపై మాట్లాడేందుకు రౌత్ నిరాకరించారు. ''దేశం కోసం మేము పొత్తు (కాంగ్రెస్‌తో) కొనసాగిస్తాం. ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడితే, విభేదాలు విస్మరించి, కలిసికట్టుగా ఉండగలుగుతాం'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)