మళ్లీ అధికారంలోకి వస్తాం !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓట్ బ్యాంకును పటిష్టం చేసుకునేందుకు ఛత్తర్‌పూర్ జిల్లా బపడా మల్హెర టౌన్‌లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీని ఉద్దేశించి కమల్‌నాథ్ మాట్లాడుతూ, 11 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. ఆ వెంటనే రైతు రుణాలను మాఫీ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కులాలు, మతాల వారిగా విభజన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని కమల్‌నాథ్ విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం అందర్నీ ఐక్యంగా ఉంచేందుకు పాటుపడుతుందని అన్నారు. ఇప్పటికి 18 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, రైతు ఆత్మహత్యలు, మహిళలపై అకృత్యాలు, నిరుద్యోగంలో మాత్రం రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఎందరికి ఉద్యోగాలు ఇచ్చారో సీఎం శివరాజ్ సింగ్ చెప్పాలని నిలదీశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీలు ఇచ్చారని, కానీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆయన ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఆ కారణంగానే ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయతావాదం, చైనా, పాకిస్థాన్ అంటూ బీజేపీ మాటలు చెబుతోందన్నారు. జాతీయతావాదం గురించి కాంగ్రెస్‌కు బీజేపీ నేతలు పాఠాలు చెప్పనక్కర్లేదని అన్నారు. నిజమైన జాతీయతావాదానికి ప్రతీక కాంగ్రెస్ అని, బీజేపీలో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం ఒక్కటైనా ఉందా అని నిలదీసారు. రివల్యూషనరీ నేతలున్న సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఇండియాలా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ప్రపంచంలోనే లేదని, ప్రస్తుతం ఈ ఐక్యతా సంప్రదాయంపై దాడి జరుగుతోందని ఆయన విమర్శించారు. 2023 నవంబర్‌లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)