వివాదాస్పద భూముల్లో రైతులకు శాశ్వత హక్కు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ వివాదాస్పద భూముల్లో రైతులకు శాశ్వత హక్కులు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. 2016 నుంచి 22 వేల ఎకరాల భూములు వివాదాల్లో ఉన్నాయని, అవన్నీ నిషేధిత జాబిలో ఉన్నాయని, దీంతో రైతులు వాటిలో వ్యవసాయం చేసుకోలేక అమ్ముకోలేక, కొనలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి డినోటిఫై చేసిన భూములకు క్లియరెన్స్ ఇచ్చారు. వాటిపై రైతులకు సర్వ హక్కులు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. వాటికి త్వరలోనూ భూ హక్కు పట్టా కూడా కల్పిస్తామన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా భూములకు సంబంధించి పక్కా రికార్డులు లేకపోవడంతో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, కన్నీటి పర్యంతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా వారు పడుతున్న ఇబ్బందులను చూసిన తరువాతే తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన రైతుల క్లియరెన్స్‌ పత్రాలను స్వయంగా ఆయన రైతులకు అందజేశారు. తమది రైతు పక్షపాట ప్రభుత్వం అన్నారు. అందుకే రైతులకు ఏ సమస్య ఉండకూడదని అహర్నిశలు పాటుపడుతున్నా మన్నారు. కానీ గత ప్రభుత్వం రైతుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. భూ యాజమాన్య విషయంలో, చివరికి సరిహద్దుల విషయంలో స్పష్టత లేకపోవడంతో కార్యాలయాలు, కోర్టుల చుట్టూ కొన్నేళ్లుగా తిరుగుతున్నా సమస్యలు కొలిక్కి రావడం లేదన్నారు. అందుకే భూముల రీసర్వేను ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టామని సీఎం జగన్‌ రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1500 మంది సర్వేయర్లను ఇందుకోసం రిక్రూట్‌ చేశామన్నారు. కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే చేస్తున్నాం. విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లను.. రోవర్లను కూడా ఉపయోగిస్తున్నాం. సరైన సరిహద్దులను మార్క్‌ చేసి, రికార్డులను అప్‌డేట్‌ చేస్తున్నమాని గుర్తు చేశారు. అలాగే హక్కు పత్రాలను అర్హులకు అందజేసే వరకు దీన్ని కొనసాగిస్తామన్నారు. అలాగే చుక్కల భూములని, అనాధీన భూములని నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం చూపించామని.. 22(1) ఏ కింద నిషేధిత భూముల సమస్యను పరిష్కరిస్తూ రైతులకు పట్టాలు అందించే కార్యక్రమం ఇవాళ మొదలుపెట్టామన్నారు. నవంబర్‌లో 1,500 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి సరిహద్దులు నిర్ణయించడంతో పాటు భూహక్కు పత్రాలు అందజేస్తామని మరోసారి హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)