వైఎస్ వివేకా హత్య కేసు బదిలీకి సుప్రీంకోర్టు అంగీకారం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో పెను సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఆంధ్ర ప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. తన తండ్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయటానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలనుకుంటున్నారు? అంటూ పిటీషనర్ ను ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పును వచ్చే శుక్రవారం వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. తన తండ్రి హత్యా కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సందర్భంగా ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలనుకంటున్నారంటూ ప్రశ్నించింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఆంధ్ర ప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాల్ని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ప్రకారం.. కేసులో నిందితులు.. దర్యాప్తు విచారణాధికారిపైనే తిరిగి కేసులు పెట్టారు. మేజిస్ట్రేట్ ముందు 164 స్టేట్‌మెంట్ ఇస్తామన్న పోలీసు అధికారి శంకరయ్యకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత శంకరయ్య.. తనపై సీబీఐ ఒత్తిడి తెచ్చి, 164 స్టేట్‌మెంట్ అడిగినట్లు లేఖ రాశారు. రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారు.అందుకే విచారణలో జాప్యం జరుగుతోంది. హత్య జరిగిన తర్వాత నిందితులు చెప్పినట్లుగా స్థానిక పోలీసులు వ్యవహరించారు. నిందితుల్ని విచారణ జరిపి, చార్జిషీటు దాఖలు చేయాల్సిన పోలీసులు.. చార్జిషీటు ఆలస్యం చేసి వారికి సహకరించారు అని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొంది. దీనిలో అన్ని అంశాల్ని పూర్తిగా వివరించినట్లుగా సమాచారం. కాగా, సునీతా రెడ్డి వాదనలు అన్నింటికీ సీబీఐ మద్దతు తెలిపింది. ఆమె చెప్పేవన్నీ నిజాలేనని స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఈ హత్య చంద్రబాబే చేయించారని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కానీ తాను అధికారంలోకి వచ్చాక కూడా తన సొంత బాబాయ్ ను ఎవరు హత్య చేశారు?అనిదాన్ని కనిపెట్టేలా విచారణ జరిపించలేకపోయారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీబీఐ దర్యాప్తుకోసం డిమాండ్ చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం పట్టించుకోలేదు. దీంతో వివేకా కుమార్తె సునీతారెడ్డి సీబీఐ దర్యాప్తు కోరుతు సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ఆ తరువాత సీబీఐ పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగించారు. నిందుతుల్ని కూడా గుర్తించారు. విచారణ జరిపారు. తన తండ్రి హత్య విషయంలో సునీతారెడ్డి పలువురిపై అనుమానాలు వ్యక్తంచేశారు. తన కుటుంబానికి కూడా హాని ఉందని..పలువురు తమ ఇంటి పరిసరాల్లో రెక్కీ చేస్తున్నారనే అనుమానాలను కూడా ఆమె వ్యక్తంచేసారు. ఈ కేసును ఇక్కడితో వదిలేయాలంటూ తనను బెదిరిస్తున్నారంటూ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి వాపోయారు. తన తండ్రిని అంత దారుణంగా చంపినవారిని ఎలా వదిలేస్తానని ప్రశ్నించారు. ఇలా ఈకేసు పలు కీలక పరిణామాల మధ్య సునీతారెడ్డి తన తండ్రి హత్య కేసు విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరగా సుప్రీంకోర్టు అంగీకరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)