తగ్గిన బంగారం ధర !

Telugu Lo Computer
0


ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల్లో భారీగా హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. దీనిని కట్టడి చేసేందుకే కొంతకాలం కిందట యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచింది. ఈ నవంబర్‌లో మరోసారి వడ్డీ రేట్లు పెంచనున్నట్లు గట్టి సంకేతాలు ఇచ్చింది. దీంతో మరోసారి ఆ భయాలతో అమెరికా మార్కెట్లు పడిపోయాయి. దీంతో బాండ్ల ప్రతిఫలాలు పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్ల అటువైపు మళ్లుతున్నారు. దీంతో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి సైతం పసిడి బాటలోనే పయనిస్తూ ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 1626 డాలర్ల వద్ద ఉండటం గమనార్హం. ఇక స్పాట్ సిల్వర్ ధర 18.34 డాలర్లకు చేరింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి పతనమైంది. ఏకంగా రూ.83ను అధిగమించి అక్కడక్కడే కదలాడుతోంది. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.530 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,380 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.500 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,020కి దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు దిగొచ్చాయి. తాజాగా రూ.440 మేర పసిడి ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,350 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,900కి పతనమైంది. మార్కెట్‌లో వెండి ధర మరోసారి క్షీణించింది. తాజాగా వెండి ధర రూ.510 మేర తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.60,700కి పడిపోయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)