తెలుగుదేశం పార్టీ అంతర్గత సర్వే !

Telugu Lo Computer
0


వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. పార్టీ నేతలతో జరిగే సమావేశాల్లో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. గెలిచి తీరాల్సిందేనని, రెండో ఆప్షన్ లేదని, అందరూ కష్టపడాలని ఖరాఖండిగా తేల్చేస్తున్నారు. కొంతమంది నేతలు ప్రభుత్వ వ్యతిరేకత తమను గెలిపిస్తుందనే భావనతో పనిచేయడంలేదని, వారందరినీ అవసరమైతే తప్పిస్తానని, సీటు ఇతరులకు కేటాయిస్తానని తేల్చేశారు. దీంతో నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ ప్రచారానికి, బలోపేతానికి రంగంలోకి దిగారు. విభజిత ఏపీలో జరిగిన రెండో ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీలో చంద్రబాబు కీలక మార్పులు చేస్తున్నారు. 13 జిల్లాలకు అధ్యక్షులు కొనసాగే సాంప్రదాయాన్ని రద్దుచేసి లోక్ సభ నియోజకవర్గాలవారీగా అధ్యక్షులను నియమించారు. ప్రస్తుతం 25 లోక్ సభ స్థానాలకు 25 మంది అధ్యక్షులున్నారు. తర్వాత రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగింది. ప్రతి అధ్యక్షుడు తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. వీరు ఎలా పనిచేస్తున్నారనే విషయమై చంద్రబాబు సర్వే నిర్వహింపచేశారు. వీటిని ఏర్పాటు చేసిన సమయంలో పనితీరులో వెనకబడ్డారని, అయితే క్రమేపీ మెరుగుపడుతూ వచ్చిందని ఇప్పటికీ తమ పనితీరు మార్చుకోనివారున్నారనేది ఆ నివేదిక సారాంశం. ఏయే లోక్ సభ నియోజకవర్గాల్లో అధ్యక్షులు ఎలా పనిచేస్తున్నారు? పార్టీ పరిస్థితి ఏమిటి? తదితర విషయాలపై అంతర్గత సర్వే జరిగింది. 25 స్థానాలకుగాను 9 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగుందని, 5 నియోజకవర్గాల్లో పర్వాలేదని వచ్చింది. 11 నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ పరిస్థితి బాగోలేదని, వెంటనే అక్కడ 'మరమ్మతులు' ప్రారంభించాలని తేలింది. పార్టీ పరిస్థితి మొత్తం అన్ని స్థానాల్లో బాపట్లలో బాగుందని తేలింది. బాపట్ల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బాపట్ల, రేపల్లె, వేమూరు, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు. గత ఎన్నికల్లో పర్చూరు, చీరాల, అద్దంకి, రేపల్లె నాలుగు నియోజకవర్గాలను టీడీపీ గెలుచుకుంది. బాపట్ల, వేమూరు, సంతనూతలపాడు వైసీపీ దక్కించుకుంది. తర్వాత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరారు. రేపల్లె, అద్దంకి, పర్చూరులో బలంగా ఉండటమేకాకుండా బాపట్ల, వేమూరు స్థానాల్లో టీడీపీ బలపడింది. సంతనూతలపాడులో వెనకబడినప్పటికీ రోజురోజుకు మెరుగవుతుందని తేలింది. చీరాలలో వెనకబడి ఉన్నప్పటికీ వైసీపీలో ఉన్న గ్రూపుతగాదాలు టీడీపీకి కలిసివస్తాయనే అంచనా ఉంది. మొత్తంమీద చూసుకుంటే టీడీపీ అన్ని నియోజకవర్గాల్లోను పరిస్థితి బాగుండటంతో సర్వేలో నెంబర్ వన్ నియోజకవర్గంగా నిలిచింది. రానున్న ఎన్నికల వరకు ఇదే పనితీరును కనపరచాలంటూ చంద్రబాబు అక్కడి నేతలను మెచ్చుకోవడంతో పాటు వారికి ప్రోత్సాహాన్నిస్తున్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షులుగా ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)