భాషాయుద్ధానికి తెర తీయొద్దు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా హిందీని అమలు చేయాలన్న ప్రతిపాదనపై ఎన్నో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దేశమంతటా ఒకే భాష ఎందుకుండాలన్న ప్రశ్నకు చైనా, జర్మనీని ఉదాహరణగా చూపిస్తున్నా ఇప్పుడది ఇండియాలో వర్కవుట్ అయ్యే పరిస్థితులు లేవు. పైగా దక్షిణాది రాష్ట్రాల్లో భాషాభిమానం ఎక్కువ. ఉత్తర భారత్‌లో హిందీ అమలు సాధ్యమైనా ? ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ హిందీని తప్పనిసరి చేయాలన్న పార్లమెంటరీ కమిటీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. హిందీని బలవంతంగా రుద్దేందుకు.. బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడేవారినే భారతీయ పౌరులుగా, మిగతావారిని రెండో తరగతి పౌరులుగా చూడటం దేశాన్ని విభజించడమేనని అన్నారు.  ఇలాంటి చర్యలతో భాషాయుద్ధానికి తెర తీయొద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. రాజ్యాంగం కల్పించిన భిన్నత్వంలో.. ఏకత్వం సిద్ధాంతాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని.. స్టాలిన్ తేల్చి చెప్పారు. బీజేపీ.. ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం, ఒకే ఆహారం, ఒకే సంస్కృతిని అమలు చేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. ఇది.. భారత యూనియన్‌ను దెబ్బతీస్తుందన్నారు. హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. భారత్ మాతాకీ జై అన్నది ఓ రాజకీయ పార్టీ నినాదంగా ఉందని.. ఇది హిందీకి తల్లిపాలు తాగించి.. మిగతా భాషలకు విషం పెడతారా అని స్టాలిన్ కాస్త ఘాటుగానే ప్రశ్నించారు. వాస్తవానికి  దేశంలో కామన్ లాంగ్వేజీని అమలు చేయడం సాధ్యం కాదు. ఇప్పుడున్న 22 అధికార భాషలకు తోడు మరిన్ని భాషలను చేర్చాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్న సయమంలో.. పార్లమెంటరీ కమిటీ ఇలాంటి రిపోర్ట్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో.. ఇంగ్లీష్‌ను తొలగించాలని ఎందుకు సిఫారసు చేశారంటూ నిలదీస్తున్నారు. ఇవన్నీ.. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలేనని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా హిందీ మీడియం అమల్లోకి వస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయ్. అర్థం కాని భాషను.. విద్యార్థులపై బలవంతంగా రుద్దితే.. వారి చదువులు దెబ్బతినే ప్రమాదముంది. మాతృభాషలో కాకుండా.. మరే భాషలో బోధించినా.. వారు అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. హిందీ.. సెకండ్ లాంగ్వేజ్‌గా ఉంటేనే.. పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అలాంటిది.. పూర్తిగా హిందీలోనే చదువుకోవాలంటే.. సౌత్‌లో మొత్తం ఎడ్యుకేషనల్ సిస్టమే దెబ్బతినే పరిస్థితులున్నాయంటున్నారు. పైగా.. సౌత్ ఇండియాలో హిందీ కంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లే ఎక్కువ. ఇంగ్లీష్‌ వల్లే.. అంతర్జాతీయంగా మన వాళ్లు పోటీ పడగలుగుతున్నారు. విదేశాల్లోనూ.. అక్కడి ఉద్యోగాల్లోనూ సత్తా చాటుతున్నారు. అలాంటిది.. విద్యాసంస్థల్లో పూర్తిగా హిందీ మీడియమే వస్తే.. ఈ పరిస్థితి పూర్తిగా తలకిందులవుతుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 16న హిందీ దివస్‌లో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హిందీ అధికార భాష అని ప్రకటించారు. ఇప్పుడు.. ఆయన నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ.. విద్యా సంస్థల్లో హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. మాతృ భాషను ప్రేమించే దక్షిణాది రాష్ట్రాలు.. హిందీ అమలుపై కేంద్ర ప్రభుత్వ తీరు, పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలను ఒప్పుకునే పరిస్థితి లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)