నంబర్ ప్లేట్ నిబంధనలకు సవరణలు !

Telugu Lo Computer
0


దేశంలోని వాహనాలకు బీహెచ్‌ సిరీస్‌ నంబర్‌ ప్లేట్‌ విధానం తీసుకురావాలని నిర్ణయించిన కేంద్ర రహదారి, రవాణాశాఖ ఆ నిబంధనల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడానికి కొన్ని సవరణలు ప్రతిపాదించింది. సంబంధిత ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. బీహెచ్‌ సిరీస్‌ నంబర్‌ ప్లేట్‌ ఉన్న వాహనాలను ఇతరులకు బదిలీ చేయొచ్చు. కొత్త యజమాని బీహెచ్‌ సిరీస్‌ పొందడానికి అర్హుడై ఉంటే అదే నంబర్‌ ప్లేట్‌తో వాహనాన్ని నడుపుకోవచ్చు. ఈ వాహనాన్ని అనర్హులకు బదిలీ చేస్తే మాత్రం బీహెచ్‌ సిరీస్‌ నంబర్‌ ప్లేట్‌ స్థానంలో సాధారణ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిబంధనల ప్రకారం మోటార్‌ వాహన పన్ను చెల్లించాలి. ఓ వ్యక్తి బీహెచ్‌ సిరీస్‌ రిజిస్ట్రేషను పొందే అర్హత సాధిస్తే, ఆ వ్యక్తి చేతిలో సాధారణ రిజిస్ట్రేషనుతో ఉన్న వాహనాన్ని బీహెచ్‌ సిరీస్‌కు మార్చుకోడానికి కొత్త నిబంధనల కింద అనుమతిస్తారు. ఇందుకు వర్తించే పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. బీహెచ్‌ సిరీస్‌ రిజిస్ట్రేషను కోసం వినియోగదారులు తాము నివసిస్తున్నచోట కానీ, లేదంటే పనిచేసేచోట కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. వర్కింగ్‌ సర్టిఫికెట్‌ జారీని మరింత కఠినతరం చేశారు. ఇదివరకు ఫలానా వ్యక్తి తమ కార్యాలయంలో పనిచేస్తున్నారని చెప్పి ఓ సంస్థ అధీకృత లేఖ ఇస్తే సరిపోయేది. ఇది దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్న కారణంగా ఇప్పుడు సంస్థ పేరు, దాని రిజిస్ట్రేషన్‌ నంబర్‌, జీఎస్‌టీ నంబర్‌, పాన్‌, చిరునామా, ఈ-మెయిల్‌ అడ్రస్‌ అడుగుతారు. అలాగే ఉద్యోగి నుంచి గుర్తింపు కార్డు, యూనిక్‌ అకౌంట్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, పాన్‌ నంబర్‌ వివరాలనూ పొందుపరచాల్సి ఉంటుంది. ఈ ముసాయిదా నిబంధనలపై సూచనలు చేయదలచుకుంటే 30 రోజుల్లోపు కేంద్ర రహదారి రవాణాశాఖకు పంపవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)