సైనికుల కోసం సరుకు రవాణా డ్రోన్లు

Telugu Lo Computer
0


చైనా సరిహద్దులో సైన్యానికి అవసరమయ్యే సరుకు రవాణా కోసం భారత సైనిక విభాగం కొత్త నిర్ణయం తీసుకుంది. సరుకు రవాణా చేయగలిగే లాజిస్టిక్ డ్రోన్ల కోసం టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 363 లాజిస్టిక్ డ్రోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిలో అత్యంత ఎత్తులో ఎగరగలిగే 163 డ్రోన్లు, మీడియం ఎత్తులో ఎగురగలిగే మరో 200 డ్రోన్లను సైన్యం కొనుగోలు చేయనుంది. చైనా సరిహద్దులో సైన్యానికి ఆహారం, ఇతర సరుకులతోపాటు, ఆయుధాలు చేరవేయడం పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఎందుకంటే చైనా-భారత సరిహద్దు పూర్తి పర్వతాలతో కూడుకుని ఉంటుంది. ఇక్కడికి రవాణా సౌకర్యం కూడా పెద్దగా లేదు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రహదారులు నిర్మిస్తోంది. ప్రస్తుతం సరుకులు, ఆయుధాల రవాణా కోసం ట్రక్కులు, జంతువుల్ని వాడుతున్నారు. ఇది చాలా శ్రమతో కూడుకున్నది. పైగా ఎక్కువ సమయం పడుతోంది. అందుకే ఈ సేవలకు గాను డ్రోన్లు వాడాలని ఆర్మీ నిర్ణయించింది. దీని ద్వారా సరుకులు, ఆయుధాల్ని త్వరగా సరిహద్దుకు చేర్చగలిగే వీలుంటుంది. ఇది సైన్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ డ్రోన్లకు సంబంధించి కేంద్రం కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు రూపొందించింది. నిబంధనల ప్రకారం ఒక్కో డ్రోను 100 కేజీలకంటే ఎక్కువ బరువు ఉండకూడదు. అత్యంత ఎత్తులో ప్రయాణిస్తూ, వేగంగా వీచే గాలులను ఎదుర్కోవాలి. కనీసం 40 నిమిషాలు నిరంతరాయంగా, కనీసం 10 కిలోమీటర్లకు తగ్గకుండా ప్రయాణించగలగాలి. అలాగే కనీసం 1,000 ల్యాండింగ్స్ చేయగలగాలి. ఎక్కువ ఎత్తులో ఎగురగలిగే డ్రోన్లు 15 కేజీల బరువును, మీడియం రేంజులో ఎగిరే డ్రోన్లు 20 కేజీల బరువును మోయగలగాలి. దేశీయంగా తయారైన వాటికే ప్రాధాన్యం ఇస్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)