కాంతారకు లీగల్ నోటీసు ?

Telugu Lo Computer
0


రిషబ్ శెట్టి హీరోగా, దర్శకత్వం చేసిన చిత్రం కాంతార. ఇప్పుడు ఎక్కడ విన్నా కాంతార చర్చే నడుస్తోంది. అందులో రిషబ్ శెట్టి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు నమోదు చేస్తోంది ఈ సినిమా. భాషలకు, ప్రాంతాలకు అతీతంగా సినిమాను ప్రజలు ఆదరిస్తున్నారు. ‘కాంతార’ విజయంలో రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, భూత కోలతో పాటు సంగీతం కూడా ప్రముఖ పాత్ర పోషించింది. నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ తరుణంలో తమ బాణీని కాపీ చేశారంటూ లీగల్ నోటీస్ రావడం చిత్ర బృందానికి షాక్ అని చెప్పాలి. ‘కాంతార’ సినిమాలోని పతాక సన్నివేశాల్లో వచ్చే ‘వరాహ రూపం…’ సాంగ్ తమ ‘నవసర’కు కాపీ అని ‘తైక్కుడం బ్రిడ్జ్’ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేసింది. తమకు మద్దతు ఇవ్వవలసిందిగా సోషల్ మీడియాలో నెటిజనులకు విజ్ఞప్తి చేసింది. ‘మా శ్రోతలకు మేము చెప్పేది ఏంటంటే ‘కాంతార’ చిత్రానికి, మాకు ఎటువంటి సంబంధం లేదు. మా సాంగ్ ‘నవసర’, ‘కాంతార’లోని ‘వరాహ రూపం…’ పాట మధ్య సారూప్యతలు పూర్తిగా కాపీ రైట్ చట్టాలను ఉల్లఘించడమే. ఇన్స్పిరేషన్, కాపీ… మా దృష్టిలో ఈ రెండిటి మధ్య గీత చాలా భిన్నమైనది. అలాగే, వివాదాస్పదమైనది కూడా! అందువల్ల, ఈ కాపీకి కారణమైన వాళ్లపై మేం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాం” అని సోషల్ మీడియాలో ‘తైక్కుడం బ్రిడ్జ్’ పేర్కొంది. ఆ పోస్టును ‘కాంతార’ సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్, నిర్మాత విజయ్ కిరగందూర్, సినిమా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా ట్యాగ్ చేసింది. ఈ ఆరోపణలపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)