50వ చీఫ్ జస్టిస్ గా డి వై చంద్రచూడ్

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ నియామకం ఖరారైంది. జస్టిస్‌ చంద్రచూడ్‌ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లలిత్‌ ప్రతిపాదించారు. ఆ నియామకాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ట్విటర్ ఖాతాద్వారా వెల్లడించారు. నవంబరు 9వ తేదీన సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగుతారు. 2024, నవంబర్‌ 10న పదవీ విరమణ చేస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ పదవీ కాలం నవంబరు 8వ తేదీతో ముగియబోతోంది. అనేక కీలక తీర్పుల్లో జస్టిస్‌ చంద్రచూడ్‌ భాగస్వామిగా ఉన్నారు. సుప్రీంకోర్టుకు అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ వైవీ చంద్రచూడ్‌  కుమారుడే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌. 1959, నవంబర్‌ 11న మహారాష్ట్రలో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అనంతరం హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలోనే రెండు అడ్వాన్స్‌డ్‌ డిగ్రీలు పొందిన వ్యక్తి చంద్రచూడ్. ముంబయి హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 39 సంవత్సరాల వయసులోనే ముంబయి హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. భారత అదనపు సొలిసిటర్ జనరల్ గా 1988లో సేవలందించారు. అనంతరం ముంబయి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని పొందారు. అలహాబాద్ హైకోర్టు సీజేగా 2013-16 మధ్యకాలంలో విధులు నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2016, మే 13వ తేదీ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. పలు కీలక కేసుల్లో తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ చంద్రచూడ్ సభ్యునిగా ఉన్నారు. తండ్రీ కొడుకులిద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసి చరిత్రలో నిలిచిపోనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)