బస్సులో చెలరేగిన మంటలకు 11 మంది ఆహుతి !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని నాసిక్ లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి డీజిల్ ట్రక్కును ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో 11 మంది సజీవదహనం అయ్యారు. 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈరోజు తెల్లవారు జామున 5 గంటలకు యవత్మాల్ నుంచి ముంబై వెళ్తున్న బస్సు నాసిక్ - ఔరంగాబాద్ రహదారిపై వద్దకు రాగానే డీజిల్ ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదంలో 11 మంది మృతి చెందారని నాసిక్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అమోల్ తాంబే తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆయన చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులను మహారాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర మంత్రి దాదా భూసే తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల సాయాన్ని ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)