తెలంగాణ రాష్ట్ర పండుగగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

Telugu Lo Computer
0


కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఘనంగా నివాళులర్పిస్తూ  ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా పలు పార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఆయన చేసిన కృషిని, నిస్వార్థ సేవలను సీఎం స్మరించుకున్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంటూనే, చాకలి ఐలమ్మతో సహా పలువురు ఉద్యమకారులకు న్యాయవాదిగా సేవలందించారని గుర్తుచేశారు. అణగారిన వర్గాల హకుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితకాలం కృషి చేశారన్నారు. బహుజన నేతగా, నేతన్నలైన పద్మశాలీలను సంఘటితం చేశారని, తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ స్ఫూర్తి మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని వివరించారు. రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరుతో ప్రభుత్వం అవార్డులను అందజేస్తున్నదని తెలిపారు. సబ్బం డ వర్ణాల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం ఇస్తున్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసింది. గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, చైర్మన్‌గా సీహెచ్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ముఖ్య సలహాదారులు, ఉపాధ్యక్షులు, కన్వీనర్లు, కోకన్వీనర్లు, కోఆర్డినేటర్లతో ఆహ్వాన కమిటీని నియమించింది. ఈ నెల 27న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా హైదరాబాద్‌ రవీంద్రభారతిలో 27న ఉదయం 10 గంటల నుంచి కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ బీ వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)