నాపై కక్షతో పోలవరాన్నినాశనం చేశారు !

Telugu Lo Computer
0


జగన్‌ పాలనలో రాష్ట్రం అన్ని విభాగాల్లో భ్రష్టు పట్టిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోనసీమ, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు రాజమహేంద్రవరంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వరద బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు, తనపై కక్షతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. అమరావతితో పాటు రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టారని మండిపడ్డారు.రాజమహేంద్రవరంలో అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పార్టీ శ్రేణులు అన్నా క్యాంటీన్లు నిర్వహించడం ఆనందంగా ఉందని, టీడీపీ అధికారంలోకి వస్తే వీటిని మరింత మెరుగ్గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అంతకు ముందు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు గోదావరికి వరదలు వస్తాయని ఈనెల 12నే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిందని చెప్పారు. విపత్తుల నిర్వహణ వ్యవస్థలను గాలికొదిలేయటంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు చూపు లేక జనాన్ని ముంచేశారని మండిపడ్డారు. బాధితులకు రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదని, తెలంగాణ ప్రభుత్వం లాగా ఇక్కడా రూ.10 వేల చొప్పున సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వరదల సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరు కాబట్టి వారికి సాధారణ వరద బాధితుల కంటే రెట్టింపు సహాయం ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)