ఆసియాలో సంపన్న మహిళ సావిత్రి జిందాల్ !

Telugu Lo Computer
0


ఆసియాలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచారు జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్. భారతీయ మహిళా వ్యాపారవేత్త ఈ ఘనత సాధించడం అరుదైన విషయం. గత ఐదేళ్లుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనాకు చెందిన మహిళా వ్యాపారవేత్త యాంగ్ హుయాన్ మూడో స్థానానికి పడిపోయారు. చైనాకు చెందిన మరో వ్యాపారవేత్త ఫాన్ హోంగ్‌వియ్ రెండో స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. సావిత్రి జిందాల్ నికర సంపద 11.3 బిలియన్ డాలర్లు (రూ.89,490 కోట్లు)గా ఉంది. ఇప్పటివరకు మొదటి స్థానంలో ఉన్న యాంగ్ హుయాన్ సంపద గత జనవరిలో 23.7 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే, ఈ ఏడాదిలో చైనాలో నెలకొన్న రియల్ ఎస్టేట్ సంక్షోభం వల్ల ఆమె సంపద సగానికి పైగా తగ్గిపోయింది. దీంతో ఆమె సంపద ప్రస్తుతం 11 బిలియన్ డాలర్ల (రూ.87,114 కోట్లకు)కు పడిపోయింది. సావిత్రి జిందాల్ దేశంలోనే అత్యంత సంపద కలిగిన మహిళ. దేశ సంపన్నుల జాబితాలో ఆమె పదో స్థానంలో ఉన్నారు. 2005లో ఆమె జిందాల్ గ్రూప్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. ఆమె భర్త ఓపీ జిందాల్ విమాన ప్రమాదంలో మరణించడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె జిందాల్ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి సంస్థను సావిత్రి జిందాల్ విజయపథంలో నడిపిస్తున్నారు. ఈ సంస్థ దేశంలో మూడో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. అనేక ఇతర రంగాల్లోనూ వ్యాపారాలు సాగిస్తోంది. వ్యాపార నిర్వహణతోపాటు సేవా కార్యక్రమాల్లోనూ ఈ సంస్థ ముందుంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)