అనుచిత పద ప్రయోగానికి చింతిస్తున్నా !

Telugu Lo Computer
0


తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు రాజకీయంగా పెను దుమారం రేపి రెండు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసిన 'రాష్ట్రపత్ని' పద ప్రయోగం పట్ల కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి శుక్రవారం క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ ద్వారా నేరుగా తెలియజేశారు. ఆమె పదవిని మరోలా సంభోదించడంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. నోరుజారడం వల్లే తప్పిదం జరిగిందని వివరించారు. ''మీ హోదాను తప్పుగా పేర్కొన్నందుకు పశ్చాత్తాపం చెందుతూ ఈ లేఖరాస్తున్నాను. నోరుజారడం వల్ల దొర్లిన పొరపాటిది. అందుకు క్షమాపణ చెబుతున్నాను. దీన్ని అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని అధీర్‌ రంజన్‌ ఈ లేఖలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై భాజపా తీవ్ర అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో అధీర్‌ గురువారం విలేకరులతో మాట్లాడుతూ...'రాష్ట్రపతిని కలిసి క్షమాపణ చెబుతాన'ని వెల్లడించారు. అయితే, అందుకు రాష్ట్రపతి భవన్‌ నుంచి అనుమతి లభించిందో లేదో స్పష్టంకాలేదు. రాష్ట్రపతి ముర్ము ప్రస్తావనను లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తీసుకొచ్చిన తీరుపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అధీర్‌ శుక్రవారం లేఖ రాశారు. 'జన్మతః బెంగాలీనైన నాకు హిందీలో అంతగా ప్రావీణ్యం లేదు. రాష్ట్రపత్ని అంటూ పొరపాటున సంబోధించా. ఇది నిజంగా విచారకరమే. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ ఈ అంశాన్ని వివాదంలోకి లాగింది. ఈ గొడవతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు ఎలాంటి సంబంధంలేకున్నా ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభ రికార్డుల నుంచి ఆ అంశాలను తొలగించండి. రాష్ట్రపతిని గౌరవ వచనంతో కాకుండా కేవలం 'ద్రౌపదీ ముర్ము' అని పదే పదే సంభోదిస్తూ స్మృతి చేసిన వ్యాఖ్యలనూ రికార్డుల నుంచి తొలగించాల'ని అధీర్‌ రంజన్‌ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)