ఏపీఎస్ఆర్టీసీలో మహిళా డ్రైవర్లు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికను తయారు చేశారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం తొలి దశలో 310 ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) మహిళలకు హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేయడంలో శిక్షణ ఇచ్చి ప్రస్తుతం ఉన్న ఖాళీలలో ఆర్టీసీ బస్సులకు డ్రైవర్లుగా నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే . సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేయడానికి త్వరలో మార్గదర్శకాలను సైతం విడుదల చేయనున్నారు. ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాలలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లకు ప్రాథమికంగా ఆదేశాలిచ్చారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులని ప్రకటించిన నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేసి వారికి ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ లలో 32 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్సులపైనే వారికి శిక్షణ ఇవ్వడంతో డ్రైవింగ్ లో వారికి మరింత మెళకువలు తెలిసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మహిళా అభ్యర్థులకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం తో పాటు, ఆర్టీసీలోనే డ్రైవర్ గా పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి అర్హత, నైపుణ్యాన్ని బట్టి తొలిదశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులలో నియామకాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలకు పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులలో మహిళలకు స్థానం దక్కనుంది .

Post a Comment

0Comments

Post a Comment (0)