షిండే వర్గంలో చేరనున్నశివసేన ఎంపీలు ?

Telugu Lo Computer
0


శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్ తగిలే సూచన కనిపిస్తోంది. ఎమ్మెల్యేల బాటలోనే శివసేన ఎంపీలు ఉద్ధవ్‌ను వీడి ఇవాళ షిండే వర్గంలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఎంపీలు స్పీకర్‌ ఓం బిర్లాను కలవనున్నారు. తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ అందించనున్నారు. అటు శివసేనలో కొత్త నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఏర్పాటు చేసిన షిండే.. మొత్తం పార్టీని హస్తగతం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. మెజార్టీ నేతలు తనవైపే ఉన్నారని చెబుతున్న ఏక్‌నాథ్ షిండే..అసలైన శివసేన తనదేనంటున్నారు. షిండే వర్గం ఎమ్మెల్యేలను అనర్హులగా ప్రకటించాలని ఉద్ధవ్….ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని షిండే తరపున దాఖలైన పిటిషన్ల విచారణకు ముందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి వేగంగా పావులు కదిపారు. పార్టీలో అసలు చీలికే రాలేదని, మార్పులు మాత్రమే జరిగాయన్న అభిప్రాయం కలిగించేలా…షిండే అడుగులు వేశారు. తన వర్గం నేతలతో కొత్త నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రకటించిన షిండే…పార్టీ అధినేత పదవిలో మాత్రం ఉద్ధవ్ థాక్రేనే కొనసాగించారు. పార్టీ ముఖ్య నాయకుడు అనే ఓ పదవి సృష్టించి..తనకు కేటాయించుకున్నారు. శివసేనను మొత్తంగా తన నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. మొత్తం 19 మంది ఎంపీల్లో 12 మంది షిండే వైపున్నారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ను రద్దు చేసి..పునర్‌వ్యవస్థీకరించడాన్ని వారు సమర్థించారు. రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం లేకండా బీజేపీ డైరెక్షన్‌లో షిండే..ఈ వ్యూహరచన చేశారు. శివసేన నుంచి తాము చీలిపోలేదని, అసలైన శివసేన తమదేనని నిరూపించుకునే ప్రయత్నంలో రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. శివసేన ఎమ్మెల్యేలగానే వారు కొనసాగాలనుకుంటున్నారు. ఏదో ఒక పార్టీలో విలీనమయ్యేందుకు సిద్ధంగా లేరు. కొత్త నేషనల్ ఎగ్జిక్యూటివ్‌పై తీర్మానం చేసి ఎన్నికల కమిషన్‌ను సంపద్రించి అసలైన శివసేనగా గుర్తించాలని కోరడం షిండే వర్గం లక్ష్యం. అయితే షిండే ప్రతిపాదనను ఉద్ధవ్ తిరస్కరించారు. కోర్టులో తమకు ఎదురుదెబ్బ తగులుతుందన్న భయంతోనే షిండే ఈ ప్రతిపాదనలు చేస్తున్నారని ఉద్ధవ్ వర్గీయులు ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడిగా ఉద్ధవ్‌నే నియమించినప్పటికీ కొత్త నేషనల్ ఎగ్జిక్యూటివ్‌లో ఆదిత్య థాక్రే, సంజయ్ రౌత్, సుభాష్ దేశాయ్ వంటి నేతలకు చోటు లభించలేదు. దీంతో అసలీ కొత్త ఎగ్జిక్యూటివ్ చెల్లదని ఉద్ధవ్ వర్గీయులంటున్నారు. ఇది కామెడీ ఎక్స్‌ప్రెస్‌ సీజన్‌2 అని సంజయ్‌ రౌత్ ఎద్దేవా చేశారు. కామెడీ ఎక్స్‌ప్రెస్ సీజన్ 1 అసెంబ్లీలో జరిగిందన్నారు.మొదట ముఖ్యమంత్రి పదవిని, తర్వాత పార్టీని తన వశం చేసుకుంటూనే..ఉద్ధవ్‌ థాక్రేను అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఆయన నాయకత్వాన్నీ గౌరవిస్తున్నట్టుగా చెప్పేందుకు ఏక్‌నాథ్ ప్రయత్నిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)