కేంద్రం ఆదేశాలతో వంట నూనెల రేట్లు తగ్గిస్తున్న కంపెనీలు

Telugu Lo Computer
0


ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న సామాన్యులకు ఊరటనిచ్చే వార్త. ప్రభుత్వ జోక్యంతో కంపెనీలు ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గించడం ప్రారంభించాయి. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఎడిబుల్ ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపింది. ప్రపంచ వ్యాప్తంగా నూనెల ధరలు తగ్గుతున్న తరుణంలో.. దేశీయంగాను వంట నూనెల ధరలను వారం రోజుల్లోగా తగ్గించాలని ఆదేశించింది. వినియోగదారులకు ప్రయోజనాలను అందించాలని సూచించింది. దీంతో కంపెనీలు వరుసగా రేట్ల తగ్గింపును ప్రకటిస్తున్నాయి. నిన్న బాబా రామ్‌దేవ్ కు సంబంధించిన పతంజలి సంస్థ వంట నూనెల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించగా.. ఈ రోజు మదర్ డెయిరీ కూడా రేట్ల తగ్గింపుపై ప్రకటన చేసింది. కంపెనీలు వారంలోగా ఎడిబుల్ ఆయిల్ గరిష్ఠ రిటైల్ ధరను లీటరుకు రూ.10 వరకు తగ్గించాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పుడు మదర్ డెయిరీ ఇప్పుడు ధారా సోయాబీన్ ఆయిల్, ధారా రైస్ బ్రాన్ ఆయిల్ ధరలను లీటరుకు రూ.14 వరకు తగ్గించింది. అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గడమే ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది. కొత్త ఎంఆర్‌పీతో కూడిన నూనె వచ్చే వారం నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ధారా రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ ఇకపై లీటరుకు రూ.180కే లభిస్తుంది. ప్రస్తుతం దీని ధర లీటరు రూ.194గా ఉంది. అదేవిధంగా.. ధారా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ ధర ప్రస్తుతం లీటరుకు రూ.194 నుంచి రూ.185కి తగ్గనుంది. రానున్న 15-20 రోజుల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలను తగ్గించవచ్చని కంపెనీ తెలిపింది. అంతకుముందు జూన్ 16న మదర్ డెయిరీ వంటనూనెల ధరలను లీటరుకు రూ.15 వరకు తగ్గించింది. గ్లోబల్ ఎడిబుల్ ఆయిల్ ధరలు నిరంతరం క్షీణిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఆయిల్ ధరలను ఒకే విధంగా ఉంచాలని ప్రభుత్వం కంపెనీలను కోరింది. అయితే లీటరుకు రూ.10 మేర ఎమ్ఆర్పీ తగ్గించాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ సూచనల అనంతరం బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఫుడ్స్‌ కూడా కుక్కింగ్ ఆయిల్ ధరలను తగ్గించింది. ఎడిబుల్ ఆయిల్ ధరలను నిరంతరం మార్కెట్ ధరలకు అనుగుణంగా తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. పతంజలి ఏప్రిల్ 2022 నుంచి ఇప్పటి వరకు ఎడిబుల్ ఆయిల్ ధరను లీటరుకు రూ.25 మేర తగ్గించింది. పతంజలి పామాయిల్, సోయా ఆయిల్ లీటరుకు రూ.20 వరకు తగ్గించింది. అదేవిధంగా పతంజలి సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరుకు రూ.25 తగ్గింది. వంటనూనె ధరను లీటరుకు రూ.10-15 వరకు అదనంగా తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)