కొండ చరియలు విరిగిపడడంతో స్తంభించిన ట్రాఫిక్

Telugu Lo Computer
0


జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై గురువారం ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో అనేక చోట్ల రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇరుపక్కలా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు వెయ్యికిపైగా వాహనాలు రోడ్డుపై నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. అమర్‌నాథ్ యాత్రికుల కాన్వాయ్ కూడా ఈ ట్రాఫిక్‌లోనే చిక్కుకుంది. ఇది దాదాపు 270 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి. కాశ్మీర్‌ను, దేశంలోని అనేక ప్రాంతాలను కలిపే రహదారి ఇదే. ఈ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పెద్దపెద్ద రాళ్లు రహదారిపై పడ్డాయి. దీంతో రెండు వైపులా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారి మధ్యలో చిక్కుకుపోయిన అమర్‌నాథ్ యాత్రికులను చందర్‌కూట్, నాష్రి వద్ద నిలిపివేశారు. వీరికి అక్కడే తాత్కాలిక వసతి కల్పించారు. మరోవైపు అధికారులు రహదారి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రొక్లైనర్లు, జేసీబీలతో రాళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయి. దీంతో రవాణకు అంతరాయం ఏర్పడుతుంది. గత మే నెలలో కూడా రాంబన్ జిల్లాలో ఇలాగే ట్రాఫిక్ స్తంభించింది. నిర్మాణంలో ఉన్న ఒక టన్నెల్ కూలడంతో పది మంది కూలీలు మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)