హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతినివ్వలేం

Telugu Lo Computer
0


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భీమవరం పర్యటన సందర్భంగా తన హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అనుమతివ్వాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు స్థానిక ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం ఇంతకుముందు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకోవడం, ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ అనుమతినిచ్చినట్లు ఎలాంటి లేఖను కోర్టు ముందుంచని నేపథ్యంలో ల్యాండింగ్‌కు అనుమతిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. రోడ్డు మార్గం ద్వారా మాత్రమే భీమవరం వెళ్లాల్సి ఉన్నందున తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్నందున పోలీసుల భద్రతకు ఆదేశాలు ఇవ్వలేమని పునరుద్ఘాటించింది. అయితే రఘురామకృష్ణరాజు భీమవరం వెళ్లే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. శాంతిభ్రదతలకు విఘాతం కలగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తాను వచ్చే హెలికాప్టర్‌కు ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ లేదా ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో ల్యాండింగ్‌కు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు శనివారం అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)