శ్రీశైలం - కుల సత్రాలు

Telugu Lo Computer
0


శ్రీశైలంలో ఆర్యవైశ్య అన్న సత్రం, పద్మశాలీయ సత్రం,  విశ్వ బ్రాహ్మణ సత్రం , యాదవ సత్రం , రజక సత్రం,లింగాయత్ బలిజ సత్రం , కమ్మ సత్రం, అఖిల భారత రెడ్ల సత్రం , వడ్డీ , వడ్డెర సత్రం, గౌడ సత్రం, తెలగ , కాపు, బలిజ సత్రం , బ్రాహ్మణ సత్రం , క్షత్రియ సత్రం , కుమ్మరి సత్రం తదితర  కుల సత్రాలు శ్రీశైలంలో వెలిసాయి ఎందుకు ?  ఇతర పుణ్య క్షేత్రాలలో ఎక్కువగా కుల సత్రాలు లేవు ఎందుకు ? 20 వ శతాబ్దం వరకూ హోటల్ వ్యవస్థ, సహ పంక్తి భోజనాలు లేవు. 19వ శతాబ్దం లో గ్రామాలు వదలి ఇంగ్లీషు చదువులూ, నగరాలకు చదువుల కోసం రావడాలు, వాటితో పూటకూటిళ్ళు వచ్చాయి. శ్రీ శైలం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నా , కర్ణాటకలోని ఆరాధ్యులకూ, వీరశైవులకూ, లింగాయతులకూ అతి ప్రధాన క్షేత్రం గా భావింపబడుతుంది. వైష్ణవులకు శ్రీ రంగం, ఆరాధ్యులకు శ్రీశైలం అతి ప్రధాన క్షేత్రాలు.. బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర లలో శ్రీశైలం యాత్రలు వర్ణింపబడ్డాయి. ప్రభుత్వం సెక్యులర్ గాబట్టి భక్తుల సౌకర్యాలు మొదలైన వాటి జోలికి పోదు. అందుచేత ఆయా కులాల వాళ్ళే తమ వాళ్ల కోసం సత్రాలు ఏర్పాట్లు చేసుకొంటూ వచ్చారు. తొలి రోజులలో కర్ణాటకుల వీరశైవ సత్రం, కరివెన సత్రం ఉండేవి. శ్రీ శైలం డాం నిర్మాణంతో శ్రీ శైలం పెద్ద ఊరుగా ఏర్పడింది, అది మొదలు ఈ క్షేత్రం సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది గానీ, అంతకు ముందు ఆ ఘాట్ రోడ్డులో ప్రయాణం మహా కష్టం. క్రూర మృగాల బాధలూ ఉండేవి. రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. ఎంతో ప్రయాస పడి శ్రీ శైలం చేరే వారు . బృందాలుగా పాదయాత్ర చేసి, మార్గ మధ్యలో త్రిపురాంతకం మొదలైన క్షేత్రాలు దర్శించుకొంటూ శ్రీశైలం చేరే వారు. అక్కడికి చేరాక బస చెయ్యడానికి ఇబ్బందిగా ఉండేది. ఆ నాడు యాత్రికుల సంఖ్య గూడా తక్కువగానే ఉండేది. అందుచేత సత్రాలు అత్యవసరం అయ్యాయి. తొలిరోజుల్లో సత్రాలలో కేవలం నివాస సౌకర్యమే ఉండేది. క్రమంగా యాత్రికులు వివిధ ప్రాంతాల వాళ్ళు విరివిగా రావడంతో వివిధ కులాల ఆధ్వర్యంలో సత్రాలు వచ్చాయి. కొన్ని సత్రాలలో భోజన సౌకర్యాలూ ఏర్పడ్డాయి.. దాతల ఆశయాల మేరకు ట్రస్టులు నడవాలి గాబట్టి వివిధ కులాల సత్రాలు ఆ నిబంధనలనే అనుసరిస్తాయి. వచ్చే యాత్రికులు గూడా వారికీ అనుకూలంగా అభివృద్దికి డొనేషన్లు ఇచ్చి సహకరిస్తూ ఉంటారు. అన్ని సత్రాలలోనూ వాళ్ల నిబంధనలకు అనుగుణంగా ఇతరులకూ సౌకర్యం కలిగిస్తున్నారు. ఆ విదంగా కుల సత్రాలు శ్రీశైలంలో ఎక్కువగా వెలిసాయి. ఇతర పుణ్య క్షేత్రాలలో ఇప్పటికి కుల సత్రాలు తక్కువగానే కనిపిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)