పదిహేడేళ్లకే ఓటరుగా పేరు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో 17 సంవత్సరాలు దాటిన వారు కూడా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చు. అది అడ్వాన్స్‌గా మాత్రమే. అంటే 17 ఏళ్లకే ఓటరుగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ, ఓటు హక్కు మాత్రం 18 ఏళ్లకే వస్తుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్లు వయసు వచ్చిన వాళ్లు, ఆ తర్వాత ఓటరుగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై జనవరి 1 మాత్రమే కాకుండా… ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి పద్దెనిమిదేళ్లు పూర్తయ్యే వాళ్లు కూడా ఓటరుగా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ తేదీల నాటికి పద్దెనిమిదేళ్లు రాబోతున్న వాళ్లు ముందుగానే తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. దీనివల్ల యువత ఓటు హక్కు కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఎవరి వీలునుబట్టి వాళ్లు ముందుగానే పేరు రిజిష్టర్ చేసుకోవచ్చు. భారత ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిషన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై అన్ని రాష్ట్రాలకు సూచనలు చేశారు. ఇంతకుముందు ఉన్న నిబంధనల ప్రకారం జనవరి 1 తర్వాత పద్దెనిమిదేళ్లు పూర్తయ్యే యువత మరుసటి సంవత్సరం వరకు వేచి చూడాల్సి వచ్చేది. దీనివల్ల మధ్యలో జరిగే ఎన్నికల్లో వాళ్లు ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయేవాళ్లు. తాజాగా మార్చిన నిబంధనల వల్ల యువతకు త్వరగా ఓటు వేసే అవకాశం కలుగుతుంది. ఈ నిర్ణయం వల్ల అర్హత కలిగిన యువత ఎక్కువగా ఓటర్లుగా పేరు నమోదు చేసుకునే వీలుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 17 లక్షల మంది యువత ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారు. గత ఏడాది మాత్రం 1.4 కోట్ల మంది కొత్త ఓటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)