'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలు బాలీవుడ్‌ని కప్పేశాయి

Telugu Lo Computer
0


బాలీవుడ్‌ కథ ముగిసిపోయిందనేది ఒక చెత్త అభిప్రాయ'మని హిందీ సినిమా దర్శకుడు, నిర్మాత, ప్రముఖ వ్యాఖ్యాత కరణ్‌జోహార్‌ అన్నారు. ప్రేక్షకులు ఎప్పటిలానే మంచి సినిమాలను థియేటర్లలో ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. 'గంగూబాయి కాఠియావాడి', 'భూల్‌ భులయ్యా' సినిమాల విజయాలే దీనికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. బీటౌన్‌లో బడా నిర్మాత, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన ప్రస్తుత బాలీవుడ్‌ పరిస్థితిని సమీక్షించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఈ రోజుల్లో ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడం సవాలే అయినప్పటికీ, మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు విజయాలను కట్టబెడుతున్నారు. ఈ ఏడాదే విడుదలైన 'గంగూబాయి కాఠియావాడి', 'భూల్‌ భులయ్య 2' 100కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. జూన్‌లో విడుదలైన 'జుగ్‌జుగ్‌జీయో' కూడా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే దక్షిణాది చిత్రాల జోరుముందు హిందీ బ్లాక్‌బస్టర్‌లు ఎవరికీ కనపడట్లేదు. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్2 సినిమాలు సాధించిన విజయాలు మన బాలీవుడ్‌ సినిమాలని కప్పేశాయి. అయితే పరిస్థితి మారుతుంది. హిందీ సూపర్‌స్టార్లు అయిన ఆమిర్‌ఖాన్‌, షారుక్‌, సల్మాన్‌, అక్షయ్‌ కుమార్‌ల చిత్రాలు భవిష్యత్‌లో విడుదల కానున్నాయి. 'లాల్ సింగ్‌ చడ్డా', బ్రహ్మాస్త్ర, రక్షాబంధన్‌ లాంటి పెద్ద సినిమాలు విజయం సాధించి బాలీవుడ్‌ని మళ్లీ వెలిగిస్తాయని అనుకుంటున్నాను' అని అన్నారు. తాను దర్శకత్వం వహిస్తున్న 'రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ' ఈ జాబితాలో ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రణ్‌వీర్‌సింగ్, అలియాభట్‌ హీరోహీరోయిన్లుగా ఉన్న ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయాబచ్చన్‌, షబానా ఆజ్మీ లాంటి సీనియర్లు నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం అలియాభట్‌ ప్రెగ్నెన్సీ కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. 2023 ప్రథమార్ధంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.


Post a Comment

0Comments

Post a Comment (0)